Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొఫెసర్లు ప్రభాత్ పట్నాయక్, నరసింహారెడ్డి
అమరావతి : ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న పెట్టుబడిదారి వ్యవస్థను నిర్మూలించాలంటే సోషలిజం ఒక్కటే మార్గమని ప్రముఖ ఆర్థికవేత్తలు, ప్రొఫెసర్ ప్రభాత్పట్నాయక్, ప్రొఫెసర్ డి.నరసింహారెడ్డిలు వ్యాఖ్యానించారు. ప్రాఫెసర్ ప్రభాత్పట్నాయక్ ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థ, రైతు ఉద్యమంపై రాసిన వ్యాసాలపై ప్రజాశక్తి బుకహేౌస్ మోడీ వ్యవసాయ చట్టాలను ఎందుకు వ్యతిరేకించాలి? పతనం అంచున భారత ఆర్థిక వ్యవస్థ, సంక్షోభంలో పెట్టుబడిదారి వ్యవస్థ అనే మూడు పుస్తకాలను రూపొందించింది. ఈ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడ ఎంబి విజ్ఞాన కేంద్రంలో మంగళవారం జరిగింది. పుస్తకాలను ప్రొఫెసర్ డి.నరసింహా రెడ్డి ఆన్లైన్ ద్వారా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ సంక్షోభంలో ప్రపంచ పెట్టుబడిదారి వ్యవస్థ అనే పుస్తకంలో చాలా కీలకమైన అంశాలున్నాయని తెలిపారు. ప్రపంచాన్ని నేడు ద్రవ్యపెట్టుబడి శాసిస్తోందని అన్నారు. లాభాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్లిపోయే ద్రవ్య పెట్టుబడిదారి విధానంపై ఆధారపడిన దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపో తున్నాయని అన్నారు. కరోనా ప్రభావంతో ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడిందనీ, ఈ క్రమంలో ద్రవ్యపెట్టుబడిదారులు ప్రపంచాన్ని శాసిస్తున్నారని అన్నారు. దీనినుంచి విముక్తి పొందాలంటే సోషలిజం చూపిన మార్గం ఒక్కటే పరిష్కారమని తెలిపారు. ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ ఆన్లైన్ ద్వారా ప్రసంగిస్తూ గత మూడు దశాబ్ధాలకు పైగా ప్రనపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ దేశాల్లో అమలు చేసిన నయా ఉదారవాద విధానాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాయన్నారు. దాని పర్యవసానంగా ప్రజలపై నిరుద్యోగం, వేతనాలకోతలు, ధరల పెరుగుదల తదితర రూపాల్లో పెనుభారాలు పడుతున్నాయని తెలిపారు. ప్రజల్లో తలెత్తే అసంతృప్తిని, వ్యతిరేకతను పక్కదోవపట్టించడానికీ, అణచివేయడానికి ప్రపంచంలో పలు దేశాల్లో నయా ఫాసిస్టు శక్తులు ముందుకొస్తున్నాయని అన్నారు. వాటిని ఓడించి ప్రత్యామ్నాయ విధానాలు ఎజెండాను రూపొందించి అమలు చేయడానికి, శ్రామిక ప్రజలందరినీ కదిలించి వామపక్ష ప్రజాతంత్రశక్తులు కృషి చేయాలని అన్నారు. మోడీ వ్యవసాయ చట్టాలు దేశ ఆహారభద్రతను దెబ్బతీస్తాయని, విదేశీ, స్వదేశీ కార్పొరేట్ల పట్టు మన దేశీయ వ్యవసాయంపై బిగుసుకుంటే కార్మిక, కర్షక జనావళికి అత్యంత నష్టదాయకంగా మారుతుందని హెచ్చరించారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను, వ్యాపారాలను పరిరక్షించడం, వారందరినీ కార్మిక, కర్షక సమైక్య ఉద్యమాలలో భాగస్వాముల్ని చేయడం ప్రజాతంత్ర ఉద్యమంలో కీలకం అని ప్రభాత్పట్నాయక్ వివరించారు. సీపీఐ(ఎం)ఏపీ రాష్ట్రకార్యదర్శి పి.మధు మాట్లాడుతూ పెట్టుబడిదారి వ్యవస్థలో ద్రవ్యపెట్టుబడిదారి విధానం అత్యంత ప్రమాదకరమైనదని అన్నారు. దీనివల్ల ప్రపంచానికి, భారతదేశానికి, రైతాంగానికి జరుగుతున్న నష్టాన్ని వ్యాసాల రూపంలో తెలియజేస్తున్న ప్రొఫెసర్ ప్రభాత్పట్నాయక్ కృషిని కొనియాడారు. నేడు రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి 2010లోనే ప్రభాత్ పట్నాయక్ తన వ్యాసాల్లో పేర్కొన్నారని తెలిపారు. ప్రభాత్పట్నాయక్, నరసింహారెడ్డి ప్రసంగాలను కూడా పుస్తకాల రూపంలోకి తీసుకొచ్చి పాఠకులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజాశక్తి బుకహేౌస్ యాజమాన్యాన్ని కోరారు. ప్రభాత్పట్నాయక్ రాసిన వ్యాసాలను సరళమైన భాషలోకి అనువదించి పుస్తకాలు తీసుకురావడంలో కృషి చేసిన ప్రజాశక్తి సంపాదకులు ఎంవిఎస్ శర్మను అభినందించారు.
ఎంవిఎస్ శర్మ మాట్లాడుతూ సమాజంలో వేగవతంగా చోటుచేసుకుంటున్న రాజకీయ, ఆర్థిక మార్పులను ప్రజలు గమనించి అవగాహన చేసుకోవాలని అన్నారు. పెట్టుబడిదారి విధానాల వల్ల కలుగుతున్న నష్టాలు, రైతాంగ ఉద్యమాల వెనుక దాగిఉన్న ఆర్థిక నష్టాలను ప్రభాత్పట్నాయక్ చక్కగా వివరించారనీ, ఈ పుస్తకాలను ప్రతిఒక్కరూ చదివి అవగాహన చేసుకోవాలని కోరారు. కార్యక్రమా నికి ప్రజాశక్తి బుకహేౌస్ సంపాదకులు ఎస్.వెంకట్రావు అధ్యక్షత వహించారు.