Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ
- కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకట రమణ నియమితులయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 లోని క్లాజ్ (2) ద్వారా దఖలుపడిన అధికారాలతో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ మంగళవారం జారీ చేసింది. నియామక వారెంట్, నియామక నోటిఫికేషన్ కాపీని జస్టిస్ రమణకు అందజేశారు. ఆయన ఏప్రిల్ 24న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ 48వ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తారు. ఆయన మొదటి తరం న్యాయవాది. వ్యవసాయ నేపథ్యం కలిగి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కష్ణా జిల్లా పొన్నవరం గ్రామానికి చెందిన ఆయన సాహిత్య ప్రియుడు. కర్నాటక సంగీతం పట్ల చాలా ఇష్టం. 1983 ఫిబ్రవరి 10న ఆయన న్యాయవాది వత్తిని ప్రారంభించారు. 2014 ఫిబ్రవరి 17 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన 2019 మార్చి 7 నుంచి 2019 నవంబర్ 26 వరకు సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్మెన్‌గా పనిచేశారు. 2019 నవంబర్ 27 నుంచి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నాల్సా) ఎగ్జిక్యూటివ్ చైర్మెన్‌గా కూడా పనిచేశారు. ఆయనను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా 2000 జూన్ 27న నియమించారు. 2013 మార్చి 10 నుంచి 2013 మే 20 వరకు తన మాతృ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా కూడా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, కేంద్ర, రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్, సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేశారు. రాజ్యాంగ, పౌర, కార్మిక, సేవ, ఎన్నికల వ్యవహారాల్లో ఆయన ప్రత్యేకత సాధించారు. అంతరాష్ట్ర నదీ జలాల ట్రిబ్యునల్స్‌లో కూడా ఆయన ప్రాక్టీస్ చేశారు. ఆయన వివిధ ప్రభుత్వ సంస్థలకు ప్యానెల్ కౌన్సెల్, హైదరాబాద్‌లోని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో రైల్వేలకు అదనపు స్టాండింగ్ కౌన్సెల్‌గా పని చేసిన విషయం తెలిసిందే.