Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 23 రాష్ట్రాల్లో 1,500 గ్రామాల నుంచి మట్టి సేకరణ
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
మట్టి సత్యాగ్రహ యాత్ర మార్చి 30న దండి (గుజరాత్) నుంచి ప్రారంభమై రాజస్థాన్, హర్యానా, పంజాబ్ మీదుగా ఢిల్లీ సరిహద్దులకు చేరింది. ఈ యాత్రలో 23 రాష్ట్రాల్లో 1,500 గ్రామాల నుంచి మట్టి సేకరించి ఢిల్లీ సరిహద్దులకు చేరుకుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతాంగ ఉద్యమంలో మట్టి సత్యాగ్రహం ఒక ముఖ్యమైన భాగంగా మారింది.1930 ఏప్రిల్ 6న జరిగిన ఉప్పు సత్యాగ్రహం దేశ వ్యాప్తంగా ప్రజల్లో స్ఫూర్తిని నింపింది. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా సాగిన పోరాటమన్న విషయం తెలిసిందే. దండి సత్యాగ్రహం స్పూర్తితో కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై ఉద్యమంలో భాగంగా వేలాది గ్రామాలు ఈ మట్టి సత్యాగ్రహం కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఈ కార్పొరేట్ చట్టాలకు వ్యతిరేకంగా తమ గ్రామాల నుంచి మట్టి కుండలో మట్టిని పంపారు. వివిధ రాష్ట్రాల నుంచి ఈ మట్టి కుండలు ఢిల్లీకి చేరాయి. మంగళవారం ఘాజీపూర్, సింఘూ సరిహద్దు ప్రాంతాల్లో మట్టి కుండలతో ప్రదర్శనలు జరిగాయి. ఇందులో సంయుక్త కిసాన్ మోర్చా నేతలు దర్శన్ పాల్, హన్నన్ మొల్లా, రాకేశ్ తికాయత్, మేధా పాట్కర్, యోగేంద్ర యాదవ్, డాక్టర్ సునీలం పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, తమిళనాడు, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బీహార్, ఛత్తీస్గడ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన ఈ మట్టిని అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణం కోసం ఉపయోగిస్తారు.
చారిత్రక ప్రదేశాల నుంచి మట్టి సేకరణ..
ఈ మట్టిని కొన్ని చారిత్రక ప్రదేశాలను నుంచి సేకరించారు. షాహీద్ భగత్ సింగ్ గ్రామం ఖాటా కలాన్, షాహీద్ సుఖ్‌దేవ్ గ్రామం నౌఘారా (లూథియానా జిల్లా), ఉధమ్ సింగ్ గ్రామం సునమ్ (సంగ్రూర్ జిల్లా) షాహీద్ చంద్రశేఖర్ ఆజాద్ జన్మస్థలం భభారా, ఝాబువా, మామా బాలేశ్వర్ దయాల్ సమాధి భమనియా, సభర్మాతి ఆశ్రమం, సర్ధార్ పటేల్ నివాసం, బార్డోలి రైతు ఉద్యమ స్థలాలు, అస్సాంలోని శివసాగర్, ఉత్తర దినాజ్‌పూర్, వాసన కళ్యాణ్, కర్నాటకలోని బళ్లారి, గుజరాత్‌లోని 33 జిల్లాల్లోని మండిస్, 800 గ్రామాలు, మహారాష్ట్రలోని 150 గ్రామాలు, రాజస్థాన్‌లో 150 గ్రామాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 180 గ్రామాలు, ఉత్తరప్రదేశ్‌లోని 75 గ్రామాలు, బీహార్‌లోని 30 గ్రామాలు, హర్యానాలోని 60 గ్రామాలు, పంజాబ్‌లోని 78 గ్రామాల నుంచి మట్టిని సేకరించారు. ఒడిశా రైతులు నవరంగపూర్ జిల్లాలోని పాపదాహండి గ్రామంలోని మట్టిని సేకరించి తెచ్చారు. అక్కడ 1942లో సత్యాగ్రహంలో పాల్గొన్న 19మంది బ్రిటిష్ కాల్పుల్లో మరణించారు. సంబల్పూర్, బస్తర్, ఢిల్లీ రాజారా, ధమ్తారి, ములాతై నుంచి కూడా మట్టిని సేకరించారు. అక్కడ 24 మంది రైతులు పోలీసుల బుల్లెట్ల తూటాలకు మరణించారు. ఢిల్లీలో 20 ప్రాంతాల నుంచి సేకరించిన మట్టి ప్రజా సంఘాల నేతలు అందజేశారు.
ఉద్యమం మరింత బలోపేతం : ఎస్కేఎం నేతలు
రైతు ఉద్యమం రోజురోజుకూ మరింత బలోపేతం అవుతున్నదనీ, ఆ నల్ల చట్టాలు రద్దు అయ్యే వరకూ కొనసాగుతుందని ప్రకటించారు. గ్రామాల నుంచి మట్టిని ఢిల్లీకి పంపిన అన్ని గ్రామాల రైతులకు ఎస్కేఎం నేతలు అభినందనలు తెలిపారు. ''ఈ ప్రచార కార్యక్రమం ప్రజలలో ఆసక్తిని పెంచింది. గ్రామాల్లో వందలాది మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడు కార్పొరేట్ చట్టాలను రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు'' అని ఎస్కేఎం నేతలు తెలిపారు. మట్టి సత్యాగ్రహం ద్వారా ఈ ఉద్యమం దక్షిణ భారత దేశంలో వేలాది గ్రామాలలో బలోపేతమైందని, ప్రజలు మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని బలపరిచారని అన్నారు.
రైతు ఉద్యమస్థలికి తెలుగు రాష్ట్రాల నుంచి మట్టి
తెలుగు రాష్ట్రాల్లో సేకరించిన మట్టి ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతు ఉద్యమ కేంద్రాలకు చేరింది. ఈమేరకు మంగళవారం ఘాజీపూర్, సింఘూ సరిహద్దుల్లో సంయుక్త కిసాన్ మోర్చా నేతలు రాకేశ్ తికాయత్్, మేథా పాట్కర్‌కు తెలంగాణ,ఏపీ రాష్ట్రాల నేతలు మట్టిని అందజేశారు. మట్టి సత్యాగ్రహంలో తెలుగు రాష్ట్రాల నుంచి రైతులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రైతు స్వరాజ్య వేదిక 200 గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 150 గ్రామాల నుంచి సేకరించిన మట్టిని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్‌సీసీ నేత విస్సా కిరణ్ కుమార్, రైతు స్వరాజ్య వేదిక నాయకులు కొండల్, సాగరిక, శంకర్, ఎస్ ఈశ్వ య్య పాల్గొన్నారు. తెలంగాణ,ఏపీ రాష్ట్రాలలోని రైతుల నుంచి వచ్చిన మద్దతు దష్ట్యా ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ 14 వరకు కొనసాగించాలని (సంవిధాన బచావో ఆందోళన్ దివస్) నిర్ణయించినట్టు రైతు స్వరాజ్య వేదిక నాయకులు తెలిపారు. రైతు ఆత్మహత్య బాధిత కుటుంబ సభ్యురాలు సాగరిక మాట్లాడుతూ దేశంలో మరిన్ని రైతు ఆత్మహత్యలు జరగ కూడదనీ, రైతుల పంటలకు న్యాయమైన ధరలు లభించాలని ఈ పోరాటంలో పాల్గొంటున్నట్టు తెలిపారు.