Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు అసెంబ్లీలకు ఒకేదశలో పోలింగ్
- కేరళలో 69.95, తమిళనాడులో 71.79..
- పుదుచ్చేరిలో 77.9 శాతం ఓటింగ్ నమోదు
- అసోంలోనూ ముగిసిన పోలింగ్
- బెంగాల్ మూడో దశలోనూ ఉద్రిక్తతలు
న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్లో స్వల్ప ఘటనలు మినహా కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అసోం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఒకే దశలో భాగంగా ఎన్నికలు జరిగాయి. ఇక అసోంలో చివరి విడతతో అక్కడ ఎన్నికలు పూర్తయ్యాయి. పశ్చిమబెంగాల్ లో ఎనిమిది దశలకు గానూ మంగళవారం నాటి పోలింగ్‌తో మూడు దశలు పూర్తయ్యాయి. మొత్తంగా కడపటి వార్తలు అందే సమయానికి కేరళలో 69.95 శాతం, తమిళనాడులో 71.79, పుదుచ్చేరిలో 77.9, పశ్చిమబెంగాల్లో 77.68, అసోంలో 82.28 శాతం పోలింగ్ నమోదైంది. తమిళనాడులో మొత్తం 234, కేరళలో 140, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఈ ఎన్నికలు జరిగాయి. ఇక అసోంలో చివరి దశ ఎన్నికల్లో 40, బెంగాల్ మూడో విడతలో 31 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది.
అన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఎండాకాలం కావడంతో ఉదయం వాతా వరణం కొద్దిగా చల్లగా ఉంటుందన్న భావనతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటేసేందుకు బార్లు తీరారు. కేరళలో తొలి మూడు గంటల్లో దాదాపు 20 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. కేరళ సీఎం పినరరు విజయన్, భార్య కమలతో కలిసి స్వగ్రామం పినరయిలోని ఆర్సి అమలా పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేరళ ప్రజలు ఎల్డిఎఫ్ కూటమికి చారిత్రక విజయాన్ని కట్టబెడతారని అన్నారు. కేరళలోని త్రిపునితుర
నియోజకవర్గంలోని ఎరూర్ పోలింగ్ బూత్‌లో ఇవిఎంలో సాంకేతిక లోపం తలెత్తడంతో దాదాపు గంటకుపైగా పోలింగ్ నిలిచిపోయింది. పొనురున్నిలోని సీకేసి పోలింగ్ కేంద్రంలో ప్రముఖ మలయాల నటుడు మమ్ముట్టీ ఓటేశారు. తమిళనాడులో రాజకీయ, సినీ ప్రముఖలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెన్నై నగరంలోని పలు ప్రాంతాల్లో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. బీజేపీ నేతలు డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ కోయంబత్తూరులో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పుదుచ్చేరిలో బీజేపీ కుట్ర నేపథ్యంలో రెండు నెలల క్రితం నారాయణస్వామి ప్రభుత్వం కూలిపోయని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ ఎన్నికలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
బెంగాల్లో ఉద్రిక్తతలు
బెంగాల్లో పలు చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. హుగ్లీలోని తారకేశ్వర్‌లో ఒక పోలింగ్ కేంద్రం వద్ద తమ కార్యకర్తలపై తణమూల్ కార్యకర్తలు దాడి చేశారని బీజేపీ ఆరోపించింది. డైమ్ండ్ హార్బర్లోని ఒక పోలింగ్ కేంద్రంలో ప్రజలు ఓటు వేయకుండా తణమూల్ కార్యకర్తలు అడ్డుకుంటున్నారని అక్కడి బీజేపీ భ్యర్థి దీపక్ హల్దార్ ఆరోపించారు. మరోవైపు బీజేపీ కార్యకర్తలు కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రాలను తమ అధీనంలోకి తీసుకుంటున్నారని టీఎంసీ నేతలు ఫిర్యాదు చేశారు. హుగ్లీలోని ఆరంబాగ్‌లో తణమూల్, బీజేపీ మద్దతుదారులు ఘర్షణకు దిగారు. దీంతో భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకుని వారిని చెదరగొట్టారు. అసోంలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.