Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత హక్కులను కాలరాస్తున్న బీజేపీ సర్కారు : బి వెంకట్, ఏఐఏడబ్ల్యూయూ
-పంజాబ్లో ఏఐఏడబ్ల్యూయూ, బీకేఎంయూ ఆధ్వర్యంలో సంయుక్త సదస్సు
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
దేశవ్యాప్త రైతాంగ ఉద్యమాన్ని నిర్లక్ష్యం చేస్తున్న మోడీ సర్కారుపై రానున్న రోజుల్లో మరింత సమరశీలంగా పోరాటం చేస్తామని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం(ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి వెంకట్ చెప్పారు. బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా పార్లమెంట్లో ఆమోదించుకున్న మూడు సాగు చట్టాలను రద్దుచేయాలనీ, విద్యుత్ చట్ట సవరణ బిల్లు వెనక్కి తీసుకోవాలనీ, అన్నదాతల పంటకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతన్నలు పెద్దఎత్తున ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. భారత రాజ్యాంగ రూపకర్త బిఆర్ అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 14న సంవిధాన్ బచావో కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. ఏఐఏడబ్ల్యూయూ, బీకేఎంయూ ఆధ్వర్యాన పంజాబ్లో బుధవారం సంయుక్త సదస్సు జరిగింది. ఈ సదస్సులో బి వెంకట్ పాల్గొని ప్రసంగించారు. దేశంలోని మతోన్మాద శక్తులు నిత్యం దళితుల హక్కులు, అవకాశాలపై దాడి చేస్తున్నాయని విమర్శించారు. భారత రాజ్యాంగాన్ని మనుధర్మ రాజ్యాంగంగా మార్చేందుకు కుటీల ప్రయత్నాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి సుమారు 70 ఏండ్లు కావస్తున్నా.. వారు ఇంకా వెనుకబడే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ దళితులను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటే, నేడు బీజేపీ వారిని శత్రువులుగా చూస్తున్న దుస్థితి ఉందన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 27 కోట్ల మంది దళితులు ఆర్థిక, సామాజిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అయితే, వారంతా ఉత్పత్తి శక్తులుగా దేశానికి సేవలందిస్తున్నారని గుర్తు చేశారు. ఈ చట్టాలతో వ్యవసాయ కూలీలకూ ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. దళితుల అభ్యున్నతి, హక్కుల కోసం తమ సంఘాలు సంయుక్తంగా కృషి చేస్తాయన్నారు. వ్యవసాయ వ్యతిరేక చట్టాలపై పంజాబ్లో ప్రారంభమైన ఉద్యమ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా రైతులు విరోచితంగా పోరాడుతున్నారని తెలిపారు. మోడీ సర్కారు అప్రజాస్వామికంగా తీసుకొచ్చిన ఈ మూడు రైతు చట్టాలు భారత సమాఖ్య విధానం, రాజ్యాంగానికి పూర్తి వ్యతిరేకమని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో అంశాలపై కేంద్రం ఏకపక్షంగా చట్టాలు చేయడం తగదన్నారు. రైతులు తమ ఉత్పత్తులు అమ్ముకునేందుకు స్వేఛ్చ ఉందనీ, దళారుల వ్యవస్థ లేదని కేంద్రం చెబుతోందన్నారు. ఈ సదస్సులోల బీకేఎంయూ జాతీయ ప్రధాన కార్యదర్శి గోరియా, ఏఐఏడబ్ల్యూయూ నేతలు నురిపూరి, లాల్సింగ్, రాధాకుమారి తదితరులు పాల్గొన్నారు.