Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జలఫిరంగులు, లాఠీలతో విరుచుకుపడిన పోలీసులు
- కాషాయపార్టీకి నిరసన సెగ
సిర్సా (హర్యానా) : సాగు వ్యతిరేక చట్టాల ఉద్యమంపై మోడీ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తున్నది. గత 130రోజులకుపైగా పోరాడుతున్న రైతన్నలు ఇప్పుడు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. తాజాగా హర్యానాలోని సిర్సా ప్రాంతంలో జరుగుతున్న ఎన్నికల్లో ఓటు వేయటానికి వెళ్లిన బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల ఎదుట రైతులు నిరసనకు దిగటంతో పోలీసులు రెచ్చిపోయారు. లాఠీలతో విరుచుకు పడ్డారు. జలఫిరంగులు ప్రయోగిం చారు. ఈ ఘటనలో పలువురు రైతన్నలు గాయపడ్డారు.
అసలేం జరిగింది..?
నల్లచట్టాలను రద్దుచేయాలని కోరుతూ అలుపెరగకుండా రైతులు ఉద్యమిస్తూనే ఉన్నారు. తమ ఆందోళనలో భాగంగా బీజేపీ అభ్యర్థులను ఓడించాలని రైతులు ప్రచారం చేస్తున్నారు. అలాగే ఆ పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను అడ్డుకుంటున్నారు. హర్యానాలోని బీజేపీ నేతలకు రైతు నిరసన సెగలు తాకుతూనే ఉన్నాయి. ఇటీవల ఆ రాష్ట్ర డిప్యుటీ సీఎం దుశ్యంత్ చౌతాలాను విమానాశ్రయం వద్ద అడ్డుకోవటానికి వెళ్లిన రైతులపై పోలీసులు తమ ప్రతాపంచూపిన విషయం విదితమే. కాగా, సిర్సాలో సిటీ కౌన్సిల్ చైర్పర్సన్ పదవి 30 నెలలుగా ఖాళీగా ఉన్నది. ఆ పదవికి బుధవారం ఎన్నికలు జరుగుతుంటే.. అక్కడకు బీజేపీ నేతలు తరలిరావటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీజేపీ ఎంపీ సునీతా దుగ్గల్, ఎమ్మెల్యే గోపాల్ కందా పార్టీ శ్రేణులతో కలిసి వచ్చి ఓటువేశారు. వాళ్లిద్దరూ వచ్చారని తెలియగానే.. భారీసంఖ్యలో రైతులు తరలివచ్చి నిరసన ప్రదర్శన నిర్వహించారు. అక్కడ ఏర్పాటుచేసిన బ్యారికేడ్లను దాటి మరీ నిరసనగళం వినిపించారు. బీజేపీ ప్రభుత్వంతోపాటు మోడీ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది.
నల్ల జెండాలతో ఆందోళనకు దిగారు. రైతుల్ని నిలువరించటానికి పోలీసులు జలఫిరంగులు ప్రయోగించారు. లాఠీలతో విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్టుగా పోలీసులు చితకబాదారు. పలువురు రైతులకు గాయాలయ్యాయి. అంతకుముందు కురుక్షేత్ర బీజేపీ ఎంపీ నాయబ్‌సింగ్ సైనీకి రైతులు నిరసనలు తెలిపారు. షాహాబాద్ పర్యటనకు వచ్చినపుడు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 132 రోజులనుంచి ఉద్యమం చేస్తున్నా... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని రైతునేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను మోడీ సర్కార్, పోలీసులు ఎంతగా వేధించినా... ఆ నల్లచట్టాల్ని వెనక్కితీసుకునేదాకా తమ పోరాటం ఆగేదిలేదనీ, ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని రైతులు స్పష్టం చేశారు.