Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రద్దు చేయాలని ఐఏఆర్టీడబ్ల్యూ డిమాండ్
న్యూఢిల్లీ : వాహన స్క్రాపింగ్ పాలసీని తక్షణం ఉపసంహరించుకోవాలని ఆలిండియా రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఫెడరేషన్ (ఐఏఆర్టీడబ్ల్యూ) భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఐఏఆర్టీడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి కెకె.దివాకరన్ కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ కార్యదర్శికి గురువారం ఒక లేఖ రాశారు. ఇందులో స్క్రాపింగ్ విధానానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్‌లోని నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు, రవాణ రంగ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై తగిన సూచనలు చేశారు. దేశంలో కోవిడ్ వ్యాప్తి ప్రభావం కారణంగా రవాణా రంగం ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, ఇటువంటి సమయంలో స్క్రాపింగ్ విధానాన్ని అమలు చేయడం.. వినాశనానికి దారితీస్తుందని అన్నారు. కరోనాకు తోడు పెరిగిన ఇంధన ధరలు మూలిగే నక్కపై తాటికాయపడ్డ చందంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం, ఇన్స్యూరెన్స్ ప్రీమియం, టోల్ ట్యాక్స్‌ల భారీగా పెంపుదల రవాణా రంగ సంక్షోభానికి దారితీసిందని పేర్కొన్నారు.
ఒకటి, రెండు వాహనాలు కలిగివున్న చిన్న యజమానులే.. డ్రైవర్లుగా వెళ్తున్న వారు దేశంలోని మొత్తం కమర్షియల్ వాహనాల యజమానుల్లో దాదాపు 80 శాతం ఉంటారని దివాకరన్ పేర్కొన్నారు. పైన పేర్కొన్న సమస్యల కారణంగానే ఇప్పటికే ఈ చిన్న యజమానులు వాహన కొనుగోలు కోసం ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల నుంచి తెచ్చుకున్న రుణాలకు నెలవారీ చెల్లింపులు చేయలేకపోతున్నారని, ఇటువంటి సమయంలో 'స్క్రాపింగ్ విధానం' వారిపై భరించలేని భారం మోపడంతో పాటు చిన్నయాజమానును రవాణా రంగం నుంచి పక్కకు వెళ్లిపోయే పరిస్థితులను ఏర్పాటు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
తద్వారా దేశ రవాణా రంగం మొత్తం కార్పొరేట్లలోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల, వాహన నిర్వహణ ఖర్చు, పెరిగిన ఇతర వ్యయాల కారణంగా.. యాజమానులు పాత వాహనాలను అమ్మి కొత్తవాటిని కొనుగోలు చేసే పరిస్థితుల్లో లేరని, ఇటువంటి సమయంలో స్క్రాపింగ్ పాలసీ అమలు సరికాదని అభిప్రాయపడ్డారు.
ఐఏఆర్టీడబ్ల్యూ సూచనలు
1. ఎక్సైజ్ సుంకాలను తగ్గించి ఇంధన ధరలను 2020, జనవరి స్థాయికి తీసుకురావాలి.
2. స్క్రాపింగ్ విధానాన్ని తప్పనిసరి కాకుండా స్వచ్ఛందం చేయాలి.
3. తప్పనిసరి చేయాలని అనుకుంటే.. కొత్త వాహన ఖర్చుల్లో మూడింట ఒక వంతు కేంద్రం సబ్సిడీ ఇవ్వాలి. మరో మూడో వంతు కంపెనీ డిస్కౌంగ్గా ఇవ్వాలి. బ్యాంకుల నుంచి రుణ సదుపాయంతో మిగిలిన మూడో వంతు యాజమాని భరిస్తారు.
4. పాలసీపై అభ్యంతరాలు తీసుకునేందుకు ఇచ్చిన సమయాన్ని 30 నుంచి 180 రోజులకు పెంచడంతో పాటు సంబంధిత వాటాదారులతో సంప్రదింపులు చేయాలి.
5. ట్రావెల్ డిమాండ్‌ను చేరుకునేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలను బలోపేతం చేయడంతో పాటు విస్తరించాలి.