Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోహింగ్యాలపై సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ : జమ్ములో అరెస్టు చేసిన రోహింగ్యాలను విడుదల చేసేలా ఆదేశాలు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే ఇదే సమయంలో సరైన విధానం పాటించేంత వరకు వారిని దేశం నుంచి పంపిచొద్దని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అరెస్టు చేసిన వారిని విడుదల చేయడంతో పాటు అనధికార శిబిరాల్లో ఉంటున్న వారికి ఎఫ్ఆర్ఆర్ఒ ద్వారా శరణార్థుల గుర్తింపు కార్డులు ఇచ్చేలా జమ్ముకాశ్మీర్ పాలనా యంత్రాంగం, కేంద్ర హోంశాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రోహింగ్యా కమ్యూనిటీ సభ్యుడు మహ్మద్ సలీముల్లా దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. అయితే పిటిషన్ విజ్ఞప్తిని తిరస్కరించిన న్యాయస్థానం ఒక విధానాన్ని అనుసరించేంత వరకు జమ్ములోని రోహింగ్యాలను పంపిచొద్దని స్పష్టం చేసింది. దీనిపై ప్రభుత్వ తరపు న్యాయవాది సొలిలిటర్ జనరల్ స్పందిస్తూ.. రోహింగ్యాల జాతీయతను మయన్మార్ ధ్రువీకరించిన తర్వాత వారిని తిరిగి అక్కడకు పంపించడం జరుగుతుందని తెలిపారు. పిటిషన్‌పై ఇంతముందు జరిగిన విచారణలో పిటిషన్‌దారు తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత భూషణ్ వాదనలు వినిపిస్తూ.. రోహింగ్యాలు తిరిగి మయన్మార్‌కు వెళ్తే అక్కడ వారు మళ్లీ దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.