Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖాళీ అవుతోన్న ఢిల్లీ, ముంబయి సహా పలు ప్రధాన నగరాలు
- గతేడాది లాక్డౌన్ గుర్తుచేస్తూ.. సొంతూళ్లకు వలస జీవులు
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. నిత్యం లక్షకు పైగా కొత్త కేసులు నమోదుకావడం.. మళ్లీ లాక్డౌన్ భయాల నేపథ్యంలో దేశంలోని పలు ప్రధాన నగరాలు మళ్లీ ఖాళీ అవుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, ముంబయి, పూణే వంటి నగరాల నుంచి ప్రజలు స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూ, వారంతపు లాక్డౌన్లు విధించడంలో వలస జీవులపై ప్రభావం పడింది. ఉపాధి కరువు అవడంతో పాటు మళ్లీ లాక్డౌన్ విధిస్తారేమోననే భయం వారిని వెంటాడుతోంది. ఈ క్రమంలోనే తిరిగి సొంత గ్రామాలకు వెళ్లిపోతున్నారు. దీంతో ఢిల్లీలోని ఆనంద్ వీహర్ బస్ స్టేషన్ వద్ద చాలా మంది కూలీలు బారులు తీరారు. మరోసారి లాక్ డౌన్ విధిస్తారనే భయం, ఉపాధి లేకపోవడంతోనే తిరిగి స్వస్థలాలకు వెలుతున్నామని చెప్పారు. గత లాక్డౌన్లో తినడానికి తిండి, తాగడానికి నీళ్లులేక అనేక ఇబ్బందులు పడ్డామనీ, మళ్లీ అలాంటి పరిస్థితి రాకూడదనే ముందుగానే తమ ఊరికి పోతున్నామని పలువురు కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రాజధానిలోనే కాకుండా ముంబయి, పూణే వంటి పలు నగరాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దాదాపు 50 శాతం మంది వలస కూలీలు మళ్లీ స్వస్థలాలకు పోతున్నారని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.