Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ : ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన వేతనాలు, పెన్షన్ల బకాయిలను వెంటనే క్లియర్ చేయాలని ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో కార్పొరేషన్‌కు మరింత సమయం ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది. ఈ మేరకు న్యాయమూర్తులు విపిన్ సంఘి, రేఖా పల్లి లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. వేతనాలు అనేది ఉద్యోగుల ప్రాథమిక హక్కు అనీ, వాటిని చెల్లించకపోవడం దానిని ఉల్లంఘించడమవుతుందని నగరపాలక సంస్థ తీరుపై కోర్టు ఆగ్రహించింది. ఢిల్లీ ప్రభుత్వ ఖజానా తగ్గిపోవడం కారణంగానే ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని సంస్థ తరఫు న్యాయవాది దివ్య ప్రకాశ్ పాండే న్యాయస్థానానికి తెలిపారు. ఈ విషయంలో ఢిల్లీ ప్రభుత్వ తీరును కూడా న్యాయస్థానం తప్పుబట్టింది. పురపాలిక సంఘాలకు నిధులు విడుదల చేయకపోవడంపై కేజ్రీవాల్ సర్కారును విమర్శించింది. ''పత్రికల్లో ప్రతిరోజూ రాజకీయ నాయకుల ఫోటోలతో ఫుల్ పేజీ ప్రకటనలకు అయ్యే ఖర్చు ఎక్కడ నుంచి వస్తున్నది? ఈ విషయాన్ని మనం మరవరాదు'' అని న్యాయస్థానం ఈ సందర్భంగా ప్రశ్నించింది. ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 80వేల మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు. వేతనాలు, పెన్షన్ల రూపంలో దాదాపు రూ. 400 కోట్లను సదరు సంస్థ వారికి చెల్లించాల్సి ఉన్నది.