Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశ వ్యాపిత లాక్డౌన్ ఉండదు
- రాత్రి పూట 'కరోనా కర్ఫ్యూ'
- పరీక్షలపై ఎక్కువగా దృష్టి పెట్టండి
- ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
భారత్లో రికార్డు స్థాయిలో ఒకే రోజు లక్షా 26వేల కరోనా కేసులు తలెత్తిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ముఖ్యమంత్రులతో కరోనా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గురువారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ సమావేశంలో ఈ నెల 11 నుంచి 14వరకు నాలుగు రోజులపాటు అన్ని రాష్ట్రాలు 'టీకా ఉత్సవ్' జరపాలని ప్రధాని మోడీ కోరారు. అర్హులైనవారందరికీ కరోనా టీకాలు వేయాలని ఆయన సూచించారు. టీకాల కార్యక్రమం కొనసాగిస్తూనే, కోవిడ్ పరీక్షలపై ఎక్కువగా దృష్టి పెట్టాలని ప్రధాని కోరారు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాత్రి పూట ''కరోనా కర్ఫ్యూ'' విధించాలని కోరారు. గతంలో మాదిరి దేశవ్యాపిత లాక్డౌన్లు ఉండవని అన్నారు. మాస్కులు ధరించడం, ఇతర జాగ్రత్తలు పాటించాల్సిన ఆవశ్యకత గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించాలని అన్నారు. రాత్రి కర్ఫ్యూ విధించిన ప్రదేశాల్లో కరోనా గురించి అప్రమత్తం చేసేందుకు ''కరోనా కర్ఫ్యూ'' అని పేర్కొనాలని అన్నారు. ఈ కర్ఫ్యూ రాత్రి 9, 10 గంటల నుంచి ఉదయం 5, 6 గంటల వరకు ఉండాలని సూచించారు. కరోనా వైరస్ బారిన పడడం వల్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఈ సమావేశానికి హాజరు కాలేదు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి సూక్ష్మ కంటోన్మెంట్ జోన్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని అన్నారు. ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు 70 శాతం చేయడమే తమ లక్ష్యమని అన్నారు. పాజిటివ్ కేసులు ఎక్కువగా వచ్చినా సరే పరీక్షలు ఎక్కువగా చేయాలని అన్నారు. సవాళ్లు ఉన్నప్పటికీ మనకు అనుభవం, వనరులు, వ్యాక్సిన్ ఉందని ప్రధాని మోడీ అన్నారు.