Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాంకుల విలీనంపై ఎవరూ నోరు విప్పటం లేదు
- ఒకప్పటి బీజేపీ సభ్యుడు, విజయా బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ రిటైర్డ్ ఎండీ
న్యూఢిల్లీ : జన్‌సంఘ్ (ఆ తర్వాత బీజేపీగా ఆవిర్భ వించింది) సభ్యుడు, విజయా బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ రిటైర్డ్ ఎండీ సుబ్బయ్య శెట్టీ బ్యాంకుల విలీనంపై మోడీ సర్కార్ విధానాల్ని తీవ్రంగా తప్పుబట్టారు. విజయా బ్యాంక్‌ను బ్యాంక్ ఆఫ్ బరోడాతో విలీనం చేయటాన్ని వ్యతిరేకించారు. ఒకప్పుడు జన్‌సంఘ్ కు, ఇప్పటి బీజేపీకి విజయా బ్యాంక్ నుంచి పెద్ద మొత్తంలో పార్టీ విరాళాలు అందాయని, ఇప్పుడదంతా మరిచిపోయారని స్థానిక (కర్నాటకలో) బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయా బ్యాంక్‌ను బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటిస్తే, ఒక్కరూ కూడా నోరు విప్పటంలేదని, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించటం లేదని శెట్టీ ఆవేదన వ్యక్తం చేశారు.తాజాగా ఆయన ఒక ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ..'' బీజేపీకి విజయా బ్యాంక్ పెద్ద ఎత్తున పార్టీ విరాళాలు అందించింది. వీటిని ఆ పార్టీ మరిచిపోయింది. 1973 ప్రాంతంలో కమ్యూనిస్టులు బలంగా ఉన్న పశ్చిమ బెంగాల్, కేరళలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను విజయా బ్యాంకు శాఖల్లో నియమించాం. తద్వారా పార్టీ విస్తరణకు బ్యాంక్ సహాయప డింది. ప్రత్యేక డ్రైవ్ కింద పశ్చిమ బెంగాల్లో 59మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను, కేరళలో 69మందిని రిక్రూట్‌చేశాం. బీజేపీ అనుబంధ కార్మిక సంఘమైన 'భారతీయ మజ్దూర్ సంఘ్'తో బ్యాంక్ ఉద్యోగ సంఘం కలిసి పనిచేసింది. ఎమర్జెన్సీ సమయంలో బీజేపీకి ఎంతగానో సహాయపడ్డాం. అయినా విజయా బ్యాంక్‌ను బ్యాంక్ ఆఫ్ బరోడాతో విలీనం చేస్తామంటే, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ నళీన్ కుమార్ నోరు విప్పటం లేదు'' అని షెట్టీ ఆగ్రహంతో పలు ఆరోపణలు చేశారు.