Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ సర్కార్కు ఎస్కేఎం నేతల హెచ్చరిక
- సాగు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాల్సిందేనని డిమాండ్
- 133వ రోజుకు చేరిన ఉద్యమం
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
మోడీ సర్కారు అప్రజాస్వామికంగా పార్లమెంట్లో ఆమోదించుకున్న సాగు చట్టాలను రద్దు చేయాలనీ, లేకపోతే ఈ నెల 10న దేశ రాజధాని సమీపంలోని కేఎంపీ హైవేని దిగ్బంధిస్తామని రైతన్నలు కేంద్ర సర్కార్ను హెచ్చరించారు. సాగుచట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల ఉద్యమం గురువారం 133వ రోజుకు చేరింది. తమ ఆందోళనలో భాగంగా ఏప్రిల్ 10న 24 గంటల పాటు కేఎంపీ హైవేని దిగ్బంధిస్తామని చెప్పారు. సామాన్య ప్రజానీ కాన్ని ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదనీ, కానీ కేంద్ర ప్రభుత్వం అహంకారపూరిత వైఖరితో రైతుల ఉద్యమాన్ని పూర్తిగా విస్మరిస్తున్నదని ఎస్కేఎం నేత దర్శన్ పాల్ విమర్శించారు. అందువల్లే తాము 24 గంటల పాటు ఆ రహదారిని దిగ్బంధించాలని నిర్ణయించినట్టు చెప్పారు. సామాన్య ప్రజానీకం కూడా తమ ఆందోళనకు సంఘీభావం తెలుపుతున్నారని అన్నారు. తమది రైతు అనుకూల ప్రభుత్వమని మోడీ సర్కారు గత కొద్ది కాలంగా చెబుతున్న వాదనలు పూర్తిగా అబద్దమని విమర్శించారు. పంట ఇన్పుట్ సబ్సిడీ అవసరమయ్యే ఉత్పత్తుల ధరలను కేంద్ర ప్రభుత్వం రోజురోజుకూ పెంచుతున్నదని విమర్శించారు. మోడీ సర్కారు పెంచిన ధరల కారణంగా మార్కెట్లో రూ.1,200లు ధర పలకాల్సిన డీఏపీ ఎరువు రూ.1,900 పెరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర ఎరువుల ధరలూ భారీ స్థాయిలో పెరిగినట్టు చెప్పారు. ఇంత స్థాయిలో ఎరువుల ధరలు ఎప్పుడూ లేవన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస మద్ధతు ధర(ఎంఎస్పీ) కూడా లభించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం), ఆలిండియా కిసాన్ ఖేత్ మజ్దూర్ సంఘం(ఏఐకేకేఎంఎస్), ఆలిండియా డెమోక్రటిక్ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో హర్యానాలో రేవారీ బైపాస్ రోడ్డు వద్ద రైతులు గురువారం ఆందోళన చేపట్టారు. ఆ రాష్ట్రంలో మనోహర్ లాల్ ఖట్టర్ తీసుకొచ్చిన ప్రాపర్టీ డామేజీ చట్టానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. సాగు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని నినాదాలు చేశారు. రేవారీతో పాటు మతన్హల్, దుజనా.. తదితర ప్రాంతాల్లో సాగు చట్టాల ప్రతులను దహనం చేశారు. దేశీయ సాంప్రదాయ వ్యవసాయ రంగాన్ని ధ్వంసం చేసేందుకే మోడీ సర్కారు ఈ చట్టాలను తీసుకొచ్చిందని ఆరోపించారు.