Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తగ్గుతున్న వ్యవసాయ కార్మికుల సంఖ్య
- 30 ఏండ్లుగా క్రమంగా కిందకు..
- వాణిజ్య, హౌటల్, రెస్టారెంట్ రంగాల్లో ఉపాధికి వెతుకులాట : కేంద్రం నివేదిక
న్యూఢిల్లీ : భారతదేశానికి వెన్నెముక అయిన వ్యవసాయ రంగంలో కార్మికుల సంఖ్య తగ్గిపోతోంది. గత 30 ఏండ్లగా మహిళలతో పాటు పురుష కార్మికుల సంఖ్య క్రమంగా పడిపోయింది. '' భారత్లో మహిళలు, పురుషులు 2020'' అంశంపై విడుదల చేసిన ఒక నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఈ నివేదికను కేంద్రం విడుదల చేసింది. ఇందులో దేశ జనాభా అంచనా, లింగనిష్పత్తి, మహిళల సగటు వివాహ వయసు, ఇంటర్నెట్ను వినియో గిస్తున్న మహిళల సంఖ్య వంటి అంశాలపై గణాంకాలను పేర్కొన్నారు. 74శాతానికి తగ్గిన కార్మికుల సంఖ్య దేశంలో వ్యవసాయ రంగంలో మహిళా, పురుష కార్మికుల సంఖ్య తగ్గిపోయింది. 1987-88 నుంచి 2018-19 వరకు ఈ పరిస్థితి నెలకొని ఉన్నది. పీఎల్ఎఫ్ సర్వే ప్రకారం.. 1987-88లో వ్యవసాయ కార్మికుల సంఖ్య 84.7 శాతంగా ఉన్నది. ఇందులో పురుషుల వాటా 74.5 శాతంగా ఉన్నది. అది 2018-19 ఏడాది నాటికి 73.2శాతానికి తగ్గిపోయింది. ఇందులో పురుషుల వాటా 55 శాతంగా ఉన్నది. అయితే, వ్యవసాయ రంగంలో కార్మికుల సంఖ్య తగ్గిపోకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచించారు. ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా వాణిజ్య, హౌటల్, రెస్టారెంట్ సెక్టార్లలో కార్మికుల సంఖ్య పెరిగిపోతున్నది. ఈ రంగాల్లో 1987లో గ్రామీణ ప్రాంతాల్లో 5.1 శాతంగా ఉన్న పురుషుల సంఖ్య 2018-19లో 9.2శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో ఇది 21.5శాతం నుంచి 24.5శాతానికి ఎగబాకింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఈ రంగాల్లో మహిళా కార్మికుల సంఖ్య 2.1శాతం నుంచి 4శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 9.8శాతం నుంచి 13శాతానికి చేరింది.
లేబర్ ఫోర్స్ సర్వే 2018-19 ప్రకారం.. కార్మికజనాభా నిష్పత్తి (డబ్ల్యూపీఆర్) గ్రామీణ రంగంలో 19.0 మంది మహిళలు, 52.1 మంది పురుషులు ఉన్నారు. పీఎల్ఎఫ్ సర్వే (2018-19) ప్రకారం.. పట్టణ ప్రాంతాల్లో ఇది 14.5 మంది మహిళలు, 52.7 మంది పురుషులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా మహిళలు (59.6శాతం మంది), పురుషులు (57.4 శాతం మంది) స్వయం ఉపాధిని కలిగి ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో 54.7శాతం మంది మహిళలు, 47.2శాతం మంది పురుషులు రోజువారీ కూలి లేదా వేతన ఉద్యోగులుగా ఉన్నారు.
2021లో దేశ జనాభాను 136.13 కోట్లుగా అంచనా వేశారు. ఇందులో మహిళల సంఖ్య 48.65 శాతంగా ఉన్నదని అంచనా. అలాగే, ఈ ఏడాది లింగ నిష్పత్తి పెరిగే అవకాశం ఉన్నదని అంచనా వేశారు. 2011లో 943గా (ప్రతి 1000 మంది పురుషులకు) ఉన్న సంఖ్య 2021లో 948గా ఉంటుందని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా మహిళల సగటు వివాహ వయస్సు 2018లో 22.3 ఏండ్లుగా ఉన్నది. 2017తో పోల్చుకుంటే మహిళల సగటు వివాహ వయస్సు 0.2 సంవత్సరాలు పెరిగింది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో 2018లో 0.1 సంవత్సరాలు, పట్టణ ప్రాంతాల్లో 0.3 ఏండ్లు పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమాచారం ప్రకారం.. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకు(ఎస్సీబీ)లలో మహిళల ఖాతాలకు సంబంధించి.. 31.88శాతం గ్రామీణులు, 29.51శాతం మంది సెమీ అర్బన్, 31.43 శాతం ఖాతాలు అర్బన్, 30.44శాతం ఖాతాలు మెట్రోపాలిటన్ ప్రాంతాల మహిళలు కలిగి ఉన్నారు. ఎన్ఎస్ఎస్ 75వ రౌండ్ (2017-18) సమాచారం ప్రకారం.. గత 30 రోజుల్లో ఇంటర్నెట్ను వినియోగించిన బాలికలు, మహిళ(5 ఏండ్ల కంటే పైబడినవారు)ల సంఖ్య 12.5 శాతంగా ఉన్నది. ఇదే ఏజ్ గ్రూప్ కలిగిన పురుషుల విషయంలో ఇది 22.3శాతంగా నమోదైంది.