Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దస్సాల్ట్‌కు రాఫెల్డీల్
- ఏజెంట్ సుషేన్ గుప్తా సాయం
-ఈడీ కేస్ ఫైల్‌తో మరిన్ని వివరాలు వెలుగులోకి
- మీడియాపార్ట్ తుది నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : రాఫెల్ విమానాల కుంభకోణంలో ఈడీ దర్యాప్తులో ప్రస్తుతం కీలకమైన వ్యక్తిగా వున్న సుషేన్ గుప్తా ఈ మొత్తం అధ్యాయంలో డాసాల్ట్ ఏవియేషన్‌కు ఏజెంట్‌గా వ్యవహరించినట్లు మీడియాపార్ట్ వెబ్సైట్ తన కొత్త నివేదికలో పేర్కొంది. ఇందుకు గానూ గుప్తాకు డాసాల్ట్ నుంచి లక్షలాది యూరోలు కమిషన్‌గా ముట్టాయి. గుప్తాపై ఈడీ దాఖలు చేసిన కేసు నుంచి తీసుకున్న కొంత సమాచారం ఈ నివేదికకు ఆధారంగా వుంది. భారత రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి రహస్య పత్రాలను అక్రమంగా సంపాదించిన గుప్తా ఈ ఒప్పందంలో మెరుగైన బేరసారాల కోసం వీటిని ఉపయోగించి ఫ్రెంచి పక్షానికి సహకరించాడని ఆ నివేదిక పేర్కొంది. మీడియా పార్ట్ తన తాజా దర్యాప్తుపై వెలువరించిన తుది నివేదికలో ఈ దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి. దీంతో మొత్తంగా ఈ అధ్యాయంపై పూర్తి స్థాయి క్రిమినల్ విచారణ జరపాలన్న డిమాండ్లు భారత్‌లో తలెత్తే అవకాశముంది. భారత ప్రభుత్వం ఒక్కో విమానానికి అధికంగా ధరను చెల్లించేలా ఫ్రాన్స్ కంపెనీకి సహాయపడేందుకు గుప్తా రహస్య పత్రాలను ఉపయోగించారని తెలిసినప్పటికీ ఈడీ ఇంతవరకు లాంఛనంగానైనా దర్యాప్తు ప్రారంభిం చలేదు. దీన్ని బట్టి చూస్తుంటే పాలక పార్టీ రాజకీయ ఎజెండాకు తగినట్లుగా ఈడీ వ్యవహరిస్తోందని అర్ధమవుతోంది. దస్సాల్ట్ దాని భాగస్వామి థాల్స్తో గుప్తాకు దాదాపు రెండు దశాబ్దాల నుంచి చాలా లోతైన వ్యాపార సంబంధాలున్నాయని మీడియా పార్ట్ పేర్కొంది. విదేశీ ఖాతాలకు, బూటకపు కంపెనీలకు రహస్యంగా కమిషన్ల ద్వారా లక్షలాది యూరోలను చెల్లించారని తెలిపింది. ఈ చెల్లింపులు, యూపీఏ ప్రభుత్వం అధికారంలో వున్నప్పటితో సహా దాదాపు 15ఏండ్ల కాలపరిమితిలో జరిగాయి. 2వేల సంవత్సరం ప్రారంభంలోనే గుప్తాను దస్సాల్ట్ కొనేసింది. సరిగ్గా అప్పుడే 126 యుద్ధ విమానాల కొనుగోలు కోసం చూస్తున్నామంటూ భారత ప్రభుత్వం ప్రకటించింది. అప్పుడే ఈ బేరాసారాలు మొదలయ్యాయి. తొలినాళ్ళలో మాట్లా డుకోవడం నుంచి ఒప్పందంపై సంతకాలు జరిగే వరకు దాదాపు 15ఏండ్ల సుదీర్ఘ కాలంలో ఫ్రెంచి కంపెనీలు గుప్తాకు అనేక లక్షల యూరోలు చెల్లిస్తూ వచ్చాయని ఈడీ దాఖలు చేసిన కేసు వివరాలను బట్టి తెలుస్తోంది. అయితే ఇక్కడ సమస్యల్లా భారత్‌లో రిజిస్టర్ అయిన గుప్తా కన్సల్టెన్సీ సంస్థకు ఈ డబ్బు చెల్లించలేదు. దానికి బదులుగా రహస్య కమిషన్ల ద్వారా నగదు బదిలీ చేశారు. వాటిల్లో కొన్ని ప్రశ్నించదగ్గ విదేశీ కంపెనీల్లో జమ అయ్యాయని ఆ నివేదిక పేర్కొంది.
భారత్‌లో అధికారులకూ ముడుపులు?
గుప్తా అందుకున్న మొత్తంలో కొంత భాగాన్ని భారత్‌లో కొంతమంది అధికారులకు ముడుపులుగా చెల్లించారని ఈడీ తన రాతపూర్వక ఫిర్యాదులో పేర్కొందంటూ మీడియాపార్ట్ పేర్కొంది. ఇందుకు కొన్ని ఆరోపణలను, సాక్ష్యాధారాలను కూడా అందులో పొందుపర్చింది.