Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాస్త్రవేత్తల అంచనా
కాన్పూర్: ఈ నెల మధ్యలో కోవిడ్-19 రెండో దశ కేసులు గరిష్టానికి చేరుకుంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆ తరువాత కేసులు తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు. అలాగే ఒక వారం తరువాత రోగ లక్షణాలు ఉన్న క్రీయాశీల కేసులు గరిష్టానికి చేరుకుంటాయని, గత ఏడాది సెప్టెంబర్ దేశం చవిచూసిన 10 లక్షల కేసుల స్థాయికి వెళ్లే అవకాశముందని చెబుతున్నారు. మేలో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న రెండో దశ కరోనా మహమ్మారి విజృంభణ గణాంకాలపై ఒక గణిత శాస్త్ర సూత్రం ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ అంచనాకు వచ్చారు.
కరోనా మొదటి దశ సమయంలోనూ దేశంలో రోజువారీ కేసుల ఆధారంగా 'సూత్ర' అనే పేరుతో ఒక గణిత విధానంతో అప్పట్లో ఒక అంచనాను రూపొందించారు. 2020 ఆగష్టులో విజృంభణ ప్రారంభమై, సెప్టెంబర్‌లో తీవ్రస్థాయికి చేరుకుంటుందని, 2021 ఫిబ్రవరికి తగ్గుముఖం పడుతుందని అప్పట్లో ఉహించారు. ప్రస్తుతం కూడా ఇదే విధమైన అంచనాను రూపొందించారు.
ఐఐటి కాన్పూర్‌కు చెందిన ప్రొఫెసర్ మణింద్ర అగర్వాల్‌తో కూడిన శాస్త్రవేత్తల బృందం ఈ అంచనాను తయారు చేసింది. దేశంలో ప్రస్తుత కొనసాగుతున్న వైరస్ విజృంభణ ఏప్రిల్ 15 నుంచి 20 తేదీల్లో తీవ్రస్థాయికి చేరుకుంటుందని తెలిపారు.
తీవ్రస్థాయిలో రోజుకు కనీసం 80 -90 వేల కేసులు నమోదవుతాయని అంచనా వేసినట్లు కాన్పూర్ ఐఐటిలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ప్రోఫెసర్ మణింద్ర అగర్వాల్ చెప్పారు. 'మనం తీవ్రస్థాయి (ఏప్రిల్ 15-20) దాటిన తరువాత వచ్చే 15-20 రోజుల తరువాత కేసుల్లో క్షీణత కనిపిస్తుంది' అని తెలిపారు.
రెండో దశ విజృంభణకు కారణాలు గురించి ప్రశ్నించగా, పాఠశాలలు, కళాశాలలు, ఇతర కార్యాలయాలు ప్రారంభించడం, అదే సమయంలో ప్రజలు నిర్లక్ష్యంగా ఉండటమని అగర్వాల్ తెలిపారు. అలాగే వేగంగా వ్యాప్తి చెందే కరోనా వైరస్ మ్యూటేషనన్ కూడా కారణం కావచ్చని తెలిపారు.
అలాగే ఏప్రిల్ నాలుగో వారం నుంచి కేసుల్లో క్షీణత నమోదవుతుందని అంచనా వేస్తున్నామని, అయితే మాస్కులు, ట్రేసింగ్, క్వారంటైన్ వంటి పద్దతు పాటించకపోతే కేసులు సంఖ్య మళ్లీ అధికమవుతుందని అగర్వాల్ హెచ్చరించారు. స్వల్ప నిర్లక్ష్యాలు వేల సంఖ్యలో కేసులు నమోదుకు కారణమవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహామ్మారికి ఒక ప్రాంతంలో ప్రారంభమై ఆకస్మాత్తుగా ఆ ప్రాంతమంతా విస్తరించే లక్షణముందని, కానీ రక్షణ చర్యలు పాటించడం ద్వారా వ్యాప్తి చాలా నెమ్మదిగా ఉంటుందని తెలిపారు.
కోవిడ్ వ్యాక్సిన్‌కు బదులు రేబిస్ టీకా
ఘజియాబాద్ : ఉత్తరప్రదేశ్‌లో మరో నిర్లక్ష్య ఘటన చేసుకుంది. ముగ్గురు వయస్సు మళ్లిన మహిళలు కోవిడ్ టీకా కోసం వెళితే రేబిస్ వ్యాక్సిన్ వేసి పంపారు. ఈ ఘటన షామ్లి జిల్లాలోని కండ్లా ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ మహిళల్లో ఒకరు మైకం, వికారానికి గురికావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని షామ్లి జిల్లా మేజిస్ట్రేట్ జాస్జీత్ కౌర్ కూడా ధృవీకరించారు. 'మహిళలు 60 నుంచి 70 ఏళ్ల వయస్సు వారని, వీరంతా కోవిడ్ వ్యాక్సిన్ వరసలో కాకుండా సాధారణ వ్యాక్సిన్ వరసలో నిలబడిన కారణంగా ఈ తప్పు జరిగిఉండవచ్చు' అని చెప్పారు. రాబిన్ వ్యాక్సిన్‌తో ఎలాంటి ప్రతికూల ప్రభావం లేదని మహిళలు తెలిపినట్లు తెలిపారు. ఏది ఏమైనా ఈ ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.