Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టు స్పష్టం
న్యూఢిల్లీ : చేతబడులు, మత మార్పిడులను నియంత్రించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ న్యాయవాది ఆశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఈ సందర్భంగా జస్టిస్ ఆర్ఎఫ్.నారీమన్ నేతృత్వంలోని ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. 18 ఏళ్ల వయసు పైబడిన ప్రతి వ్యక్తికి తన మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేసింది. ఇదే సమయంలో పిటిషనర్‌పై తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. ' ఇదేం రిట్ పిటిషన్. దీన్ని ఆర్టికల్ 32 కింద దాఖలు చేశారా? 18 ఏళ్ల పైబడిన వ్యక్తి తన మతాన్ని ఎందుకు ఎంచుకోకూడదు? ఇటువంటి పిటిషన్ వేసినందుకు మీపై భారీ జరిమానా విధిస్తాం' అని పిటిషనర్ తరపు న్యాయవాది గోపాల్ శంకరనారాయణను హెచ్చరించింది. 18 ఏళ్లు పైనున్న వ్యక్తి తన మతాన్ని ఎంచుకునేందుకు ఎందుకు అనుమతించకూడదో కారణాలు లేవని ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది. న్యాయవాది శంకరనారాయణ స్పందిస్తూ.. పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇవ్వాలని, అదేవిధంగా ప్రభుత్వం, న్యాయ కమిషన్‌కు మెమోరాండం ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. ఇందుకు అనుమతి నిరాకరించిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. మత మార్పిడి చట్టాన్ని రూపొందించేందుకు ఒక కమిటీని నియమించే సాధ్యాసాధ్యాలపై ఆదేశాలు ఇవ్వాలని కూడా అశ్విని కుమార్ ఉపాధ్యాయ తన పిటిషన్లో కోరారు. ఒప్పించో లేదా బలవంతంగా మత మార్పిడులు జరుగుతున్నాయని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.