Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ట్వీట్‌ను తొలగించిన పీఎంఓ, పీఐబీ
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ.. స్కూల్ విద్యార్థులతో నిర్వహించిన 'పరీక్షా పే చర్చ'లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విద్యార్థులకు ఆయన ఇచ్చిన 'కఠిన ప్రశ్నల' సలహాపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. 'పరీక్షా పే చర్చ' వార్షిక సమావేశంలో భాగంగా పరీక్షలకు సంబంధించిన కొన్ని సలహాలను ఆయన విద్యార్థులకు ఇచ్చారు. ఇందులో భాగంగా.. '' పరీక్షలో తొలుత సులభమైన ప్రశ్నల కంటే ముందు కఠిన ప్రశ్నలను ప్రయత్నించండి. ఇలా చేస్తే మీరు మరిన్ని ఎక్కువ కఠిన ప్రశ్నలను పరిష్కరించే చేసే అవకాశం ఉంటుంది'' అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు 'పరీక్షా పే చర్చ' హాష్ ట్యాగ్‌తో ఆయన ట్వీట్ కూడా చేశారు. అయితే, ఆయన ట్వీట్‌పై సామాజిక మాద్యమాల్లో జోకులు పేలుతున్నాయి. పరీక్షల్లో తొలుత సులభమైన ప్రశ్నలను ప్రయత్నించాలంటూ విద్యార్థులకు టీచర్లు, తల్లిదండ్రులు, కొందరు సైకాలజిస్టులు తరచూ ఇచ్చే సలహా. అయితే, ఇందుకు విరుద్ధంగా మోడీ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు వ్యంగ్యంగా స్పందించారు. ''విద్యార్థులను ఏం చేయాలనుకుంటున్నారు? వారిని ఫెయిల్ చేయాలనుకుంటున్నారా?'' అంటూ ఒకరు ట్వీట్ చేశారు. '' నేను.. నా విద్యార్థులకు ఎప్పుడూ సులభమైన ప్రశ్నలనే ముందుగా అటెంప్ట్ చేయాలని చెప్తాను. నేనూ అలానే చేశాను. పరీక్షలు చక్కగా రాశాను. నా దగ్గర అన్ని సర్టిఫికెట్లూ ఉన్నాయి'' అంటూ మరొక ఉపాధ్యాయురాలు ట్వీట్ చేసింది. అనేక మంది ఇలాగే వ్యంగ్యంగా ట్వీట్లు చేయడంతో ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ), కేంద్ర ప్రభుత్వ మౌత్ పీస్ అయిన 'ది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో'లు వెంటనే మోడీ చేసిన ట్వీట్లను తొలగించడం గమనార్హం. మొత్తానికి మోడీ ట్వీట్లు తొలగించబడ్డాయంటూ నెటిజన్లు తమ ట్వీట్ల రాతలతో హౌరెత్తించారు.