Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేనిని ప్రశ్నించినా 'ఉపా' చట్టం కింద కేసులు
- కాశ్మీర్లో పౌరులపై పెరిగిన అణచివేత
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లో ఎక్కడ ఏ చిన్న నిరసనగళం వినిపించినా, ప్రశ్నించినా వారిపై మోడీ సర్కార్ తీవ్రమైన నేరారోపణలు చేస్తూ కేసులు పెడుతోంది. ఆందోళనకు దిగుతున్న రాజకీయ నాయకులు, సాధారణ పౌరులు, మేధావులు, విద్యావేత్తలు...ఇలా అందిరిపైనా 'అన్ లా ఫుల్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్)' చట్టాన్ని కేంద్రం ప్రయోగిస్తోంది. మాకు వ్యతిరేకంగా ఏది మాట్లాడినా జైల్లో పెడతామనే బెదిరింపునకు కేంద్రం పాల్పడు తోందని జాతీయ ఆంగ్ల దినపత్రికల్లో ఇటీవల వార్తా కథనాలు వెలువడుతున్నాయి. జాతీయ నేర గణాంకాల బ్యూరో లెక్కల ప్రకారం, జమ్మూకాశ్మీర్‌లో 2015-2019మధ్య ప్రతిఏటా 255 ఉపా కేసులు నమోదవుతున్నాయి. 2015కు ముందు కేసుల సంఖ్య 60లోపే ఉండేవి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు నిరసనకు దిగినా తీవ్రమైన నేరారోపణలతో కేసులు నమోదుచేస్తున్నారని, తద్వారా ప్రజా ఆందోళనలు, నిరసనల్ని అణచివేస్తున్నారని కాశ్మీర్ న్యాయవాదులు చెబుతున్నారు. ఉపా కేసులో అరెస్టులు 72శాతం పెరిగాయని వారు గుర్తచేస్తున్నారు. అధికారిక సమా చారం ప్రకారం, 2014-2019 మధ్యకాలంలో జమ్మూకాశ్మీర్‌లో 921 ఉపాకేసులు నమోదయ్యాయి.
ఇటీవల పుల్వామా జిల్లాల్లో ఒక యువకుడ్ని భద్రతా బలగాలు ఎన్కౌంటర్ చేశాయి. మిలిటెంట్ కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని భద్రతా బలగాలు ఆరోపించాయి. అయితే ఈ ఆరోపణల్ని యువకుడి తండ్రి ఖండించాడు. ఏదేమైనా..తన కుమారుడు చనిపోయాడు, కనీసం అతడి పార్దీవదేహాన్ని అయినా ఇస్తే.. సాంప్రదాయం ప్రకారం ఖననం చేస్తామని తండ్రి భద్రతా అధికారుల్ని కోరాడు.
యువకుడు మృతదేహాన్ని తామే ఖననం చేశామని భద్రతా అధికారులు వెల్లడించారు. దాంతో ఆ గ్రామంలో ఆందోళనలు మొదలయ్యాయి. భద్రతా బలగాల తీరును ఖండిస్తూ నిరసనకు దిగారు. ఈ ఉదంతంపై కాశ్మీర్ ఐజీ విజరు కుమార్ మాట్లాడుతూ, మీరు ఇలాగే ఇండియాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తే..తీవ్రవాద ఆరోపణలతో కేసులు పెడతామంటూ ఆందోళనకారుల్ని బెదిరించారని వార్తలు వెలువడ్డాయి.
కాశ్మీర్లో ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు ఉపా చట్టాన్ని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తున్నాయని, సాధారణ పౌరులపై ఇష్టమొచ్చినట్టు కేసులు నమోదుచేస్తున్నారని కాశ్మీర్ న్యాయవాదులు సైతం చెబుతున్నారు. '' ప్రతిదానిపైనా ఉపా కేసులు బనాయిస్తున్నారు. ఈ కేసులకు సంబంధించి నా దగ్గరకే అనేకమంది బాధితులు వస్తుంటారు. రాళ్లదాడి, దోపిడీలు..వంటివాటిని కూడా ఉపా కింద నమోదుచేస్తున్నారు'' అని శ్రీనగర్‌కు చెందిన ఒక లాయర్ చెప్పారు. మరొక ఉదాహరణ, కాశ్మీర్లో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై ఉపా చట్టం కింద కేసు నమోదుచేశారు. 2018 నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. అయితే ఆయన ప్రతిరోజూ కాలేజీకి హాజరైనట్టు అధికారిక సమాచారముంది. ప్రభుత్వ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అతడు, కొంతమంది ప్రభుత్వ అధికారుల అవినీతిని బయటపెట్టడం, భూ ఆక్రమణలపై గళమెత్తడంతో పోలీసులు 'ఉపా' చట్టం కింద కేసులు నమోదుచేశారని స్థానిక పత్రికలు రాశాయి.