Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పశ్చిమబెంగాల్ ఎన్నికల బరిలో యువతరం
- 26-27 ఏండ్ల వయస్సులో గట్టిపోటీ
కొల్కతా: పశ్చిమబెంగాల్ ఎన్నికల ముఖచిత్రంలో యువతరం తేల్చుకుందామంటూ సవాల్ విసురుతున్నది. ఈ ఎన్నికల్లో 26-27 ఏండ్ల వయస్సువారు గట్టిపోటీ ఇస్తున్నారు. హౌరా సీటు నుంచి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)ని వీడివచ్చిన వైశాలి దాల్మియాకు బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. అక్కడ టీఎంసీ అభ్యర్థిగా డాక్టర్ రాణా ఛటర్జీని బరిలోకి దింపింది. 2016లో ఈ సీటును వైశాలి గెలిచింది. డాక్టర్ రాణా టీఎంసీలో సీనియర్ లీడరే. అయితే ఈ ఇద్దరు అభ్యర్థులకు ధీటుగా సీపీఐ(ఎం)తరఫున బరిలో ఉన్న అభ్యర్థి దిప్సితా అడుగులేస్తున్నది. ఢిల్లీ జవహర్లాల్ నెహ్రు యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్న దిప్సితా ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా జాయింట్ సెక్రెటరీగా కొనసాగుతున్నారు. 17 ఏండ్ల వయస్సు నుంచే విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఆమె కీలకపాత్రపోషిస్తున్నారు. జేఎన్‌యూలో బీజేపీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లోనూ పాలుపంచుకుంటున్నారు. ఈసారి ఎన్నికల్లో సీపీఐ(ఎం) తరఫున అత్యధికమది యువతరమే పోటీలో ఉన్నది. ప్రజాసమస్యలపై యువశక్తి చేస్తున్న ఉద్యమాలను పరిగణనలోకి తీసుకున్న పార్టీ ఎన్నికల్లో వారినే బరిలోకి దించింది.
మేం వయస్సులో చిన్నవాళ్ళమే. కానీ.. విధానసభలో యువత సమస్యలను లేవనెత్తగలం. అందుకే మాకు యువ ఓటర్లు కూడా పూర్తి మద్దతు ఇస్తున్నారని దిప్సిత తెలిపారు.
సీపీఐ(ఎం) తరఫున బరిలో 27ఏండ్ల అయిషీ.. 28ఏండ్ల ప్రధ
జమూరియా సీటు నుంచి లెఫ్ట్ అభ్యర్థి 27 ఏండ్ల అయిషీ ఘోష్ పోటీచేస్తున్నారు. ఆమె జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు. 2020లో వర్సిటీలోకి బీజేపీ అనుబంధశక్తులు ప్రవేశించి దౌర్జన్యానికి పాల్పడ్డాయి. ఆమెతో పాటు పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. బాలీవుడ్ నటి దీపికా పడుకొనే సహ పలువురు వర్సిటీకి వచ్చి మద్దతు తెలిపారు. అప్పటి నుంచి అయిషీ ప్రముఖంగా వార్తల్లో ఉన్నారు. ఈ స్థానం నుంచి 2016లో జహానారా ఖానా గెలిచారు. ప్రస్తుతం ఆ సీటు కోసం టీఎంసీ తరఫున హరేరామ్ సింగ్‌కు ప్రత్యర్థిగా అయిషీ ఘోష్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఇక పశ్చిమ బర్ధమన్ జిల్లాలో 28 ఏండ్ల సీపీఐ(ఎం)అభ్యర్థి ప్రధ తాV్‌ా బరిలోఉన్నారు. ఆమె తండ్రి కమ్యూనిస్టు పార్టీ సీనియర్ లీడర్. 2021లో ఆయనను ప్రత్యర్థులు మట్టుబెట్టారు. టీఎంసీ శ్రేణులే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. రాజకీయాల్లోకి రాకముందు ప్రధ మాస్ కమ్యూనికేషన్స్ చదివింది.
37 ఏండ్ల మీనాక్షి ముఖర్జీని నందిగ్రామ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇక్కడ ప్రధాన పోటీ ఆ రాష్ట్రముఖ్యమంత్రి, టీఎంసీ అభ్యర్థి మమతా బెనర్జీ, శుభేందు అధికారి(బీజేపీ) మధ్య ఉన్నా...మీనాక్షి కూడా ఓటర్లను కలుస్తూ గెలుపుకోసం బాటలు వేస్తున్నారు.
సింగూర్ నుంచి సీపీఐ(ఎం) తరఫున 27 ఏండ్ల శ్రీష్ణ భట్టాచార్యను పార్టీ ఎంపిక చేసింది. నా పోరాటం ఏ అభ్యర్థికి వ్యతిరేకంగా కాదు, అవినీతికి వ్యతిరేకమంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.
పార్టీ అకస్మాత్తుగా యువ అభ్యర్థులను బరిలోకి దింపలేదు. వారంతా గత పదేండ్లుగా విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా ఉంటూ.. మిలిటెంట్ పోరాటాలను నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధిస్తారన్న పూర్తి విశ్వాసం మాకున్నది.
- సీపీఐ(ఎం) నాయకుడు శంకర్ మొయిత్రా