Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్క రోజే 780 మంది మృతి
- 24 గంటల్లో 1,31,968 కొత్త కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కాటువేస్తున్నది. సెకండ్ వేవ్ విజృంభిస్తూనే ఉన్నది. రోజుకో రికార్డు సృష్టిస్తూ ప్రజలను హడలెత్తిస్తున్నది. ప్రతి రోజూ లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,31,968 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,30,60,542కు చేరుకుంది. ఒక్క రోజులోనే లక్షకు పైగా కేసులు నమోదుకావటం వరుసగా ఇది నాలుగోసారి. కాగా, మరింత ఆందో ళన కలిగించే అంశం ఒక్కరోజే 780మంది ప్రాణాలు కోల్పోవటం. తాజా సంఖ్యతో కలిపి దేశంలో ఇప్పటివరకూ కరోనా బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 1,67,642 చేరుకుంది. ప్రస్తుతం యాక్టివ్ సంఖ్య 9,79,608కి చేరుకుంది. కొత్తగా 61,899 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 1,19,13,292 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మొత్తం 9,43,34,262 వ్యాక్సిన్ తీసుకున్నారు.
వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 180 మంది మృతి
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో మార్చి 31 వరకు 180 మంది చనిపోయినట్టు ఏఈఎఫ్ఐ (అడ్వెర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యూనైజేషన్) కమిటీ వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ తీసుకొని మరణిస్తున్నారంటూ వార్తలు రావటంతో కేంద్రం ఏఈఎఫ్ఐ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ నివేదికలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. యూరోపియన్ యూనియన్ దేశాల్లోనూ, బ్రిటన్ లోనూ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సంభవించిన మరణాలకు, భారత్‌లో చోటుచేసుకున్న మరణాలకు సారూప్యత ఉందని ఏఈఎఫ్ఐ పేర్కొంది. యూరప్ దేశాల్లో వ్యాక్సిన్ అనంతరం మరణాలకు ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ కారణం కావొచ్చని యూరోపియన్ యూనియన్‌తో పాటు యూకే ఔషధ నియంత్రణ వ్యవస్థలు అభిప్రాయపడుతున్నాయి.