Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వయోజనులందరికీ కేంద్రమే వ్యాక్సిన్ ఇవ్వాలి: ఏచూరి
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
దేశంలోని కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే..ప్రధాని మోడీ మాత్రం మొద్దు నిద్రలో ఉన్నారని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. కోవిడ్ కేసులను కట్టడి చేసేందుకు ప్రధాని మొద్దు నిద్ర తక్షణమే వీడాలని ఆయన హితవుపలికారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ... దేశంలో బీజేపీయేతర రాష్ట్రాలన్నీ వ్యాక్సిన్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాల్సిఉండగా..మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. యుద్ధప్రాతిపదికన కరోనా వ్యాక్సిన్ను దేశంలోని వయోజనులందరికీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లౌత్ కూడా వ్యాక్సిన్ కొరతపై ప్రధానికి లెటర్ రాసిన విషయం తెలిసిందే. తమ రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత
ఉన్నదనీ, వెంటనే వ్యాక్సిన్లను పంపాలని అభ్యర్థించారు. మరో రెండు రోజుల్లో వ్యాక్సిన్ స్టాక్ పూర్తవుతుందనీ, రాష్ట్ర అవసరాల దృష్ట్యా 30 లక్షల డోసులను సత్వరమే పంపాలని గెహ్లౌత్ లేఖలో విజ్ఞప్తి చేశారు.
వ్యాక్సిన్ కొరత 'ఉత్సవం' కాదు : రాహుల్
దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరత ఉన్నదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 11 నుంచి 14 తేదీల మధ్య వ్యాక్సిన్ ఉత్సవం నిర్వహించి, అందరికీ టీకాలు అందించాలన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన పీఎం మోడీకి లేఖ రాశారు. దేశంలో వ్యాక్సిన్ కొరత అనేది చాలా సీరియస్ సమస్య అనీ, ఇది పండుగ కాదని కౌంటర్ ఇచ్చారు. భారత్లో తయారైన టీకాలను ఇతర దేశాలకు ఎగుమతి చేయడాన్ని కూడా రాహుల్ నిలదీశారు. చాలా సెంటర్లలో కోవిడ్ టీకాలు లేవనీ, వాటిని మూసేస్తున్నారని రాహుల్ పేర్కొన్నారు. ''దేశంలో కరోనా తీవ్రత పెరిగింది. వ్యాక్సిన్ల కొరత చాలా సీరియస్ సమస్య. అది ఉత్సవం కాదు. దేశ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఇతర దేశాలకు వ్యాక్సిన్లు ఎగుమతి చేయడం సరైనదేనా? ఎలాంటి సంకోచం లేకుండా కేంద్రం అన్ని రాష్ట్రాలకూ కోవిడ్ టీకాలను సరైన మోతాదులో పంపిణీ చేయాలి. అందరమూ కలిసి కరోనాపై పోరాడదాం.'' అని రాహుల్ పిలుపునిచ్చారు. కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల విషయంలో రాష్ట్రాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొందని రాహుల్ వ్యాఖ్యానించారు. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజానీకానికి కేంద్రం అండగా నిలవాల్సి ఉన్నదని రాహుల్ అభిప్రాయపడ్డారు.