Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జైపూర్‌కు అసోం ప్రతిపక్ష అభ్యర్థులు
గువహతి : అసోంలో అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వచ్చే వరకూ తమ అభ్యర్థులను కాపాడుకునేందుకు ప్రతిపక్ష కూటమి ప్రయత్నాలు మొదలుపెట్టింది. రాష్ట్రంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కూటమి మధ్య గట్టి పోటీ ఉంటుందని అంచనాలు వినిపిస్తున్నాయి. వచ్చే నెల 2న విడుదలయ్యే ఫలితాలలో మెజారిటీకి ఏమాత్రం అటుఇటూ అయినా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని భావిస్తున్న ప్రతిపక్షాలు.. ఆ పార్టీ ప్రలోభాలు, బెదిరింపుల నుంచి తమ అభ్యర్థులను కాపాడేందుకు జాగ్రత్తపడుతున్నాయి.
కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీల కూటమి దాదాపు 20 మంది అభ్యర్థులను శుక్రవారం రాజస్థాన్‌కు తరలించింది. బీజేపీ నేతలకు అందుబాటులో లేకుండా వారిని జైపూర్‌లోని ఒక హోటల్లో ఉంచారు. వీరిలో బద్రుద్దిన్ అజ్మల్ నేతృత్వంలోని ఆలిండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్)సహా పలు పార్టీల అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు కూడా అతిత్వరలో వీరితో జతయ్యే అవకాశం కనిపిస్తోంది. బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్(బీపీఎఫ్) కూడా త్వరలో ఒక రహస్య ప్రాంతానికి తరలించే అవకాశం ఉంది. తముల్పూర్ నుంచి బరిలో ఉన్న బీపీఎఫ్ అభ్యర్థి ఎన్నికలకు నాలుగు రోజుల ముందు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.
నాలుగు కేంద్రాల్లో రీపోలింగ్
అసోంలోని మూడు నియోజకవర్గాల పరిధిలో ఉన్న నాలుగు కేంద్రాల్లో ఈ నెల 20న రీపోలింగ్‌కు ఎన్నికల సంఘం ఆదేశించింది. రీపోలింగ్ నిర్వహిస్తున్న కేంద్రాల్లో రతబరి నియోజకవర్గంలోని ఎంవి స్కూల్ పోలింగ్ కేంద్రం కూడా ఉంది.ఎన్నికల నిర్వహణ పూర్తయిన తర్వాత అధికారులు ఈవీఎంలను పథార్ఖండి బీజేపీ అభ్యర్థి క్రిష్ణేందు పాల్‌కు చెందిన వాహనాల్లో తరలించారన్న వివాదం నేపథ్యంలో ఇక్కడ రీపోలింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఈసీ నలుగురు అధికారులను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.