Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెచ్చగొట్టే పోస్టులు పెట్టారని పోలీసుల ఆరోపణ
- అల్లర్ల కుట్రను బహిర్గతం చేశాననే వేధింపులు : కుంద్రు
గుర్‌గ్రామ్ : వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో పెట్టిన పోస్టులకు సంబంధించి 'ది ఇంక్' న్యూస్ పోర్టల్ వ్యవస్థాపకులు, జర్నలిస్టు రాజేష్ కుంద్రుపై హర్యానాలోని హిస్సార్ జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. మత విద్వేషాలు ప్రోత్సహించేలా, దేశ సమైఖ్యతను దెబ్బతీసేలా పోస్టులు చేశారని ఆరోపిస్తూ ఐపిసిలోని పలు సెక్షన్లు, ఐటి యాక్ట్-2008 కింద కేసు నమోదు చేశారు. 'స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. ఆ తరువాత రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో దీన్ని అమలు చేసేందుకు బ్లూప్రింట్ కూడా ఉంది' అని పేర్కొంటూ ఆయన ఈనెల 8న వాట్సాప్ గ్రూపులో మెసేజ్‌లు, ఫేస్బుక్లో పోస్టు పెట్టారని ఎఫ్ఐఆర్ పేర్కొంది. దీనిపై కుంద్రు మాట్లాడుతూ నగరంలో కుల సంబంధిత హింసకు అస్కారం ఉందని పేర్కొంటూ ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు అల్లర్లను నిరోధించేందుకు ఈ పోస్టు పెట్టానని, దీనిపై తాను ఒక కథనాన్ని కూడా రాశానని చెప్పారు. అల్లర్లను ప్రేరేపించే కుట్రను బహిర్గతం చేసినందుకే ఈ కేసు పెట్టారని తెలిపారు. కుంద్రుపై కేసు పెట్టడాన్ని హర్యానా వర్కింగ్ జర్నలిస్ట్సు యూనియన్ తీవ్రంగా ఖండించింది. ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి అని, అప్రజాస్వామిక చర్య అని యూనియన్ ఉపాధ్యక్షుడు అనిల్ శర్మ అన్నారు. కాంగ్రెస్ హర్యానా రాష్ట్ర అధ్యక్షులు కుమారి సెల్జా మాట్లాడుతూ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమంలో కుంద్రు రైతులకు మద్దతుగా ఉన్నారని తెలిపారు. కుంద్రుపై కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.