Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో
న్యూఢిల్లీ: లక్షద్వీప్‌కు సమీపంలోని సముద్ర జలాల్లో భారత ప్రత్యేక ఆర్థిక మండలిలో అమెరికా క్షిపణి విధ్వంసక నౌక యుద్ధ విన్యాసాలు జరపటాన్ని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో తీవ్రంగా ఖండించింది. ఈ చర్య భారత సార్వభౌమత్వానికి సవాలు విసిరిందని, అమెరికాకు భారత్ సామంతరాజ్యం...అనే విధంగా ఆదేశ నౌకాదళం వ్యవహరించిందని, ఈ విషయంలో అమెరికాకు తగినవిధంగా బుద్ధి చెప్పాలని పొలిట్‌బ్యూరో మోడీ సర్కార్‌ను డిమాండ్ చేసింది. క్వాడ్ (అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా) నాలుగుదేశాల కూటమి నుంచి బయటకు రావాలని మోడీ సర్కార్‌కు సూచించింది.
అమెరికా యుద్ధనౌక భారత సముద్ర జలాల హక్కుల్ని ఉల్లంఘించిందని పొలిట్‌బ్యూరో ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధ విన్యాసాలపై అమెరికా నౌకాదళం ఏడో ఫ్లీట్ చేసిన ప్రకటనే ఇందుకు ఉదాహరణ అని, భారత సముద్ర జలాల పరిధిలోకి ప్రవేశించి హక్కుల్ని సవాల్ చేయటమే యుద్ధ విన్యాసాల లక్ష్యమని అమెరికా నౌకాదళం ప్రకటించిందని పొలిట్‌బ్యూరో తెలిపింది. అమెరికా నయవంచనకు ఈ ఘటన నిదర్శనమని, అంతర్జాతీయ సముద్ర జలాల హక్కులపై ఐక్యరాజ్యసమితి ఒప్పందాల్ని అమెరికా ఉల్లంఘించిందని పొలిట్‌బ్యూరో విమర్శించింది. యుద్ధ నౌకా విన్యాసాలపై భారత్ అభ్యంతరాల్ని అమెరికా పట్టించుకోలేదు. దీనికి నిరసనగా 'క్వాడ్ కూటమి'లో సభ్య దేశంగా ఉన్న భారత్..ఆ కూటమి నుంచి వెంటనే బయటకు రావాలని పొలిట్‌బ్యూరో మోడీ సర్కార్‌ను కోరింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా ప్రయోజనాలు కాపాడటం కోసం, స్వేచ్ఛగా యుద్ధ విన్యాసాలు చేపట్టడం కోసం భారత్ ప్రయోజనాల్ని మోడీ సర్కార్ ఫణంగా పెట్టిందని ఆరోపించింది. భారత్ ఒక సామంత దేశంగా అమెరికా నౌకా దళం ప్రకటించిందని, భారతదేశ గౌరవం, సార్వభౌమత్వం కాపాడే ఉద్దేశముంటే అమెరికా నౌకాదళం చర్యకు సరైన విధంగా సమాధానం ఇవ్వాలని మోడీ సర్కార్‌ను పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది.