Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేద కుటుంబం మధ్యతరగతికి చేరాలంటే..
- కొత్తగా పేదరికంలోకి 7.5 కోట్ల మంది
కరోనా దెబ్బకు ప్రపంచంలో మధ్యతరగతి ప్రజల సంఖ్య తగ్గి.. పేదలసంఖ్య పెరిగిందని ప్యూ రీసెర్చ్ సెంటర్ (పీఈడబ్ల్యూ) నివేదిక వెల్లడించింది. భారత్లో గత ఏడాది 2020లో 7.5 కోట్లమంది పేదరికం జాబితాలో అదనంగా చేరారని తెలిపింది. ఇక ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే... పేదరిక సమస్య భారత్లోనే అత్యధికంగా ఉన్నదని నివేదిక పేర్కొంది.
రోజుకు రెండు డాలర్లు (రూ.150) సంపాదించే వారిని పేదవారిగా, రూ.750 నుంచి 1500 సంపాదించే వారిని మధ్యతరగతిగా విభజించారు. ఈ నివేదిక ప్రకారం భారత్లో 38కోట్ల మంది(28శాతం) పేదలే. ఇందులో 80శాతానికి పైగా గ్రామాల్లో ఉంటున్నారు. ప్రతి నలుగురిలో ఒకరు పేదవాడని గుర్తించారు. అందులోనూ ఎస్టీలు(47శాతం) ఎస్సీలు(29) ఒబీసీ(21) ఇతరులు(12)ఉన్నట్టు తేలింది.
కాలుష్యం.. మానసిక రోగాల్లో పేదలు
పేదలను కాలుష్యం సైతం కాటేస్తున్నది. ఢిల్లీలో వాయుకాలుష్యంపై న్యూయార్క్ టైమ్స్ పత్రిక అధ్యయనం ప్రకారం.. పేదలు నివసించే ప్రాంతాల్లో వాయికాలుష్యం నాలుగురెట్లు అధికంగా ఉన్నట్టు తేలింది. పేదరికం వారిని నిరంతరం ఒత్తిడికి గురిచేస్తున్నది. ఇది మానసిక ఆరోగ్యం, మానవ సంబంధాలకు ప్రమాదకరం. ఇది దీర్ఘకాలంలో తీవ్రమైన మానసిక రుగ్మతలకు దారితీస్తున్నది. ముఖ్యంగా ఇది బాల్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని యూకే హెల్త్ ఫౌండేషన్ హెల్త్ డైరెక్టర్ జో బీబీ అభిప్రాయపడ్డారు.
డబ్ల్యూఈఎఫ్..2020 రిపోర్టు ప్రకారం..
వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యుఈఎఫ్) గ్లోబల్ సోషల్ మొబిలిటీ రిపోర్ట్ 2020 ప్రకారం.. భారత్లోని ఒక పేద కుటుంబం మధ్యతరగతికి చేరటానికి ఏడుతరాలు పడుతున్నది.
పేదరికం అంటే...?
'రోజువారీ జీవితానికి అవసరమైన వస్తువుల కొరతను ఎదుర్కోవటం పేదరికం'. ఉదాహరణకు.. ఆహారం, నీరు, సాధారణ వైద్య సదుపాయాలు కూడా పొందలేని ప్రతి ఒక్కరూ పేదలే' అని కొలంబియా విశ్వవిద్యాలయం యొక్క ఎర్త్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జెఫ్రీ సాష్ అన్నారు.
అయితే వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) వంటి సంస్థలు కూడా పేదరికాన్ని కొలవడానికి కొన్ని పరిమితులను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. దీనిప్రకారం .. నాణ్యమైన విద్య లభ్యత, ఉద్యోగ అవకాశాలు, జీతం.. పని విధానం, సామాజిక భద్రత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది.
వాస్తవానికి భారతదేశంలో పేదలు పెరిగినా.. ఎన్ఎఫ్ఎస్ఏ కింద 67 శాతం మందికి ఆహార ధాన్యాలు ఇవ్వాల్సిఉండగా.. కేవలం 50శాతం మందికి మాత్రమే ఆహార ధాన్యాలు అందించాలని నిటి ఆయోగ్ ప్రభుత్వానికి సూచించింది. ఇది పేదలపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నదని ప్రజాసంఘాలు తెలిపాయి.
పేదరికం అంటే ప్రభుత్వాలకు అర్థంకాలే..
పేదరికం దుర్మార్గపు చక్రంలోకి నెట్టివేస్తుంది. బాల్యంలో ప్రాణాంతక వ్యాధులను నివారించడానికి వారికి టీకాలు కూడా అందవు. జీవితాంతం మందుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. వారు జీవితం ఆ ఛట్రంలోనే ముగిసిపోతుంది. దేనిలోనూ విజయం సాధించరు. పేదప్రజల కోసం తెచ్చే అన్ని పథకాలూ విఫలమవుతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వాలు పేదరికాన్ని అర్థం చేసుకోవు. పేదలు తమ జీవితకాలంలో వచ్చే ఆదాయంలో ఎక్కువభాగం ఆహారం, ఇంధనం, విద్యుత్ ఇత్యాది ఖర్చులే ఉంటున్నాయి.
- నోబెల్ విజేతలు,
ఆర్థికవేత్తలు అభిజీత్ బెనర్జీ, ఎస్తేర్ డుఫ్లో