Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా కారణంగా నష్టపోతున్న విద్యార్థులు
- సమగ్ర సంస్కరణలు చేయని కేంద్రం
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఇప్పటికే అనేక రంగాలను కుదేలు చేసింది. భారత్‌లోనూ ఈ ప్రభావం తీవ్రంగానే ఉన్నది. వాణిజ్య, వ్యాపార, సేవా రంగాలతో పాటు పలు రంగాలను అధో:పాతాళానికి నెట్టింది. కరోనా మహమ్మారి విద్యా వ్యవస్థ పైనా తీవ్ర ప్రభావం చూపింది. విద్యార్థులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. వారి హక్కులను హరించివేసింది. దేశంలో మహమ్మారి కారణంగా నెలకొన్న పరిస్థితులపై విద్యావేత్తలు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా తదనంతర పరిస్థితుల కారణంగా దేశంలో విద్య తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నది. ఇది చాలా వరకు డిజిటల్‌గా మారింది. అయితే, పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఇది తీవ్ర సమస్యగా పరిణమించింది. విద్య వ్యవస్థలో కేంద్రం సమగ్ర సంస్కరణలు చేయకపోవడం విద్యార్థులకు కష్టంగా మారింది. రాజ్యాంగం ద్వారా పిల్లలకు హామీ ఇచ్చే ఉచిత, నిర్బంధ విద్య హక్కును ఉల్లంఘించింది. అయితే, ఈ పరిస్థితిని మార్చడానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని మోడీ సర్కారును విద్యావేత్తలు నొక్కి చెప్పారు.
మహమ్మారి తెచ్చిన పరిస్థితుల కారణంగా దేశంలో పాఠశాలలు మూసివేతకు గురయ్యాయి. ఫలితంగా విద్యార్థులు తమ విద్యావ్యవస్థను నష్టపోయారు. ఆన్లైన్ ద్వారా తరగతుల నిర్వహణకు విద్యాసంస్థలు తెరతీశాయి. అయితే, పేద, మధ్యతరగతి విద్యార్థులు ఆన్లైన్ క్లాసుల విషయంలో తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆన్లైన్ క్లాసులకు అవసరమైన మొబైల్ ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు, దానికి కావాల్సిన డేటాను రీచార్జీ చేయించుకోవడం వంటి వాటిని పొందలేక వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాయని విద్యావేత్తలు ఆరోపించారు. కేవలం టీవీ లలో తరగతులను నామమాత్రంగా నిర్వహిస్తూ విద్యార్థులను గందరగోళంలోకి నెట్టాయి. అలాగే, ప్రభుత్వ పాఠశాలలు మూసివేతకు గురికావడంతో మధ్యాహ్న భోజన పథకం అమలుకు నోచుకోలేదు. దీంతో ఎందరో పేద విద్యార్థులు 'ఆకలి' బాధను ఎదుర్కొన్నారని విద్యావేత్తలు, నిపుణులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రియాశీలంగా వ్యవహరించి భవిష్యత్తు విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు.