Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రస్తుతానికి ఎరువుల ధరల పెరగవన్న కేంద్రం
- ఎరువుల కంపెనీలతో ఉన్నత స్థాయి సమావేశాలు
న్యూఢిల్లీ : ఎరువుల ధరలు తగ్గించడానికి కేంద్రం రంగంలోకి దిగింది. ముడి పదార్ధాల ధరలు బాగా పెరిగిపోయినందున ఎరువుల ధరలను కూడా 46శాతం నుండి 58.33శాతానికి పెంచుతున్నట్టు ఎరువుల ఉత్పత్తిదారులు ప్రకటించిన మరుసటి రోజునే శుక్రవారం కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకుంది. కేంద్ర రసాయనాలు, ఎరువులు శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, ఇప్పటికైతే ధరల్లో మార్పు వుండదని చెప్పారు. ప్రధాన ఎరువుల కంపెనీలతో ఉన్నతస్థాయి సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. నూతన వ్యవసాయచట్టాలను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న రైతాంగానికి ఎరువుల ధరలు కూడా ఇలా కనివినీ ఎరుగని రీతిలో పెంచడం చాలా దారుణమని ప్రతిపక్షాలు వ్యాఖ్యానించాయి. దేశంలోనే అతిపెద్ద ఎరువుల తయారీ సంస్థ ఐఎఫ్ఎఫ్సిఓ సిఇఓ అవస్థి మాట్లాడుతూ ముడి పదార్ధాల ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరిగినందున ఈ ధరల పెంపు అనివార్యమైందని అన్నారు. ఇదేమీ ప్రభుత్వ నిర్ణయం కాదని, ఎరువుల ధరలపై ప్రభుత్వ నియంత్రణ లేదని అన్నారు. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆర్థిక విధానాల్లో మార్పునకు సంబంధించి కేంద్ర జోక్యం చేసుకోవడం రెండో ప్రధాన నిర్ణయం. ఇటీవలనే, ఏప్రిల్ నుండి జూన్ త్రైమాసికానికి చిన్న పొదుపు మొత్తాల పథకాలపై వడ్డీ కోతలను నిలుపుచేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం డిఎపి, ఎన్పికె వంటి వివిధ ఎరువుల ధరలను కంపెనీలు పెంచాయి. వెంటనే కంపెనీలతో ఉన్నత స్థాయి సమావేశం జరిపి ప్రస్తుతానికి ధరలు పెంచకుండా చూసినట్టు మంత్రి వివరించారు.