Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు కేంద్రాల్లో ఔట్ ఆఫ్ స్టాక్ బోర్డులు
- ముంబయిలో ప్రయివేటు టీకా కేంద్రాలు మూత
న్యూఢిల్లీ: దేశంలో ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుండగా మరోవైపు టీకాల కొరత ఆందోళన కలిగిస్తోంది. కరోనా వ్యాక్సిన్ల కొరత ఉందని ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు బహిరంగంగా వెల్లడించాయి. అయితే, కేంద్రం మాత్రం కరోనా టీకాల నిల్వలు తగినంతగా ఉన్నాయని ఆ వ్యాఖ్యలను కొట్టిపారేసింది. తాజాగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ కరోనా వ్యాక్సిన్ల కొరతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. తక్షణమే సరఫరా చేపట్టాలని కోరుతున్నాయి. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వ్యాక్సిన్ కొరత కారణంగా పలు వ్యాక్సిన్ కేంద్రాలను మూసివేసినట్టు సమాచారం.
ముంబయిలో వ్యాక్సిన్ కేంద్రాలు మూత
కరోనా ఉధృతి అధికంగా ఉన్న మహారాష్ట్రలో టీకా కొరత తీవ్రంగా ఉంది. ఇదివరకే పలు కేంద్రాలు కరోనా టీకా ఔట్ ఆఫ్ స్టాక్ బోర్డులను ప్రదర్శించాయి. ముంబయిలో ఏకంగా కోవిడ్-19 టీకాలు ఇస్తున్న ప్రయివేటు కేంద్రాలు మూతపడ్డాయి. కరోనా టీకాల కొరత కారణంగా వ్యాక్సిన్ ఇస్తున్న ప్రయివేటు కేంద్రాలు శనివారం నుంచి సోవవారం వరకు మూసివేస్తున్నట్టు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పోరేషన్ ప్రకటిచింది.
వ్యాక్సిన్ల కొరతపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. తమ వద్ద మరో వారం రోజులకు వరకు మాత్రమే సరిపడా వ్యాక్సిన్ నిల్వలు ఉన్నాయన్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లోనూ వ్యాక్సిన్ కొరత ఉందన్నారు. మరోవైపు తమ వద్ద ఉన్న టీకా నిల్వలు కేవలం ఐదు రోజులకే సరిపోతాయని పంజాబ్ వెల్లడించింది. విదేశాలకు టీకాలను ఎగుమతి చేస్తున్న కేంద్రం.. దేశంలో టీకాల కొరతపై మెరుగైన చర్యలు తీసుకోకపోవడంపై కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ పలు విమర్శలు గుప్పించారు. కాగా, దేశంలో ఇప్పటివరకు మొత్తం 9.58 కోట్ల మందికి టీకాలు ఇచ్చారు. రెండు డోసులు తీసుకున్నవారు 1.12 కోట్ల మంది ఉన్నారు.
కరోనా వ్యాక్సిన్ ప్రక్రియపై సమాచారాన్ని ఇచ్చేందుకు కేంద్రం నో !
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ప్రభావం పెరుగుతుండటంతో వ్యాక్సిన్ల కొరత ఆరోపణలతో ఘాటుగా స్పందించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ.. వ్యాక్సిన్ల సరఫరా, టీకాల కొరత, ధరల ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడానికి ఉద్దేశపూర్వకంగానే నిరాకరిస్తున్నదని తెలుస్తోంది. పుదుచ్చేరికి చెందిన సామాజిక కార్యకర్త సౌరవ్ దాస్.. ''వ్యాక్సిన్లపై నిపుణుల కమిటీని కేంద్రం ఎలా ఏర్పాటు చేసింది, సంబంధిత చర్చలు, వ్యాక్సిన్లను మొదట 30 కోట్ల మందికి ప్రాధాన్యత ప్రాతిపదికన ఇవ్వాల్సిన అవసరం ఉందని నిర్ణయించిన విధానం, వ్యాక్సిన్ల కొరత, కో-విన్ యాప్ భద్రతను ఎలా నిర్ధారించింది'' అనే వివరాలు కోరుతూ సమాచార హక్కుచట్టం కింద దరఖాస్తు దాఖలు చేశారు. అయితే, సంబంధిత వివరాలను వెల్లడించడానికి కేంద్ర ఆరోగ్య శాఖ, దాని సంబంధిత విభాగాలు నిరాకరించాయి. ఈ వివరాలు ''వ్యూహాత్మక, శాస్త్రీయ, ఆర్థిక ప్రయోజనాల విషయాలు''గా పేర్కొంటూ వివరాలు వెల్లడించలేదు.
సమాచార హక్కు చట్టం కింద సమాచారాన్ని తిరస్కరించడానికి సరైన కారణం ఇవ్వనందున ఈ ప్రతిస్పందనలు పూర్తిగా చట్టవిరుద్ధమైనవని దరఖాస్తుదారు దాస్ అన్నారు. దేశ పౌరులకు కీలక ఆసక్తి కలిగించే అటువంటి సమాచారాన్ని కేంద్ర సమాచార కమిషన్ ఇప్పటి వరకు పరిగణనలోకి తీసుకోలేదని ఆయన అన్నారు.
కరోనా టీకా బదులు యాంటి రాబీస్ డోసులు !
లక్నో: కరోనా టీకాలకు బదులు యాంటీ రాబీస్ డోసులిచ్చిన ఘటన బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. యూపీలోని షామ్లీ జిల్లాలోని ఓ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పలువురు వృద్ధ మహిళలకు కరోనా టీకాకు బదులు యాంటీ రేబిస్ మోతాదులు ఇవ్వండంలో ప్రభుత్వం దీనిపై విచారణకు ఆదేశించింది.
మొదటి డోసు తీసుకున్న ఓ మహిళకు మైకం కమ్మినట్టు అనిపించడంతో ప్రయివేటు ఆస్పత్రికి వెళ్లగా.. ఆమె టీకా ప్రిస్క్రిప్షన్‌లో యాంటీ రాబిస్ రాసినట్టు వైద్యులు గుర్తించారు. కాగా, యూపీలో తాజాగా 12,787 కేసులు, 48 మరణాలు నమోదయ్యాయి.
మధ్యప్రదేశ్ మంత్రి గో కరోనా పూజా !
కరోనా పోవాలంటూ మధ్యప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాాకూర్ ఇండోర్ విమానాశ్రయంలోని దేవి అహిల్య బాయి హౌల్కర్ విగ్రహం ఎదుట పూజలు చేశారు. కరోనా పోవాలంటూ భక్తి గీతాలు ఆలపిస్తూ భజన చేశారు. విమానాశ్రయం డైరెక్టర్‌తో పాటు సిబ్బంది సైతం ఇందులో పాల్గొన్నారు. అయితే, సదరు మంత్రిగా మాస్క్ ధరించడం లేదని ఇప్పటికే ఆరోపణలు ఉండగా.. ఈ గో కరోనా పూజలోనూ ఆమె మాస్కు ధరించలేదు.