Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో ఒక్కరోజే 1,45,384 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. ఇదివరకు ఎప్పుడూ నమోదుకాని రీతిలో నిత్యం లక్షల్లో ప్రజలు వైరస్ బారినపడుతున్నారు. గత ఆరు రోజుల్లో వరుసగా ఐదు రోజులు నిత్యం లక్షకు పైగా కొత్త కేసులు నమోదుకావడం దేశంలో వైరస్ ఉధృతికి అద్దం పడుతోంది. యాక్టివ్ కేసుల సంఖ్య సైతం గణనీయంగా పెరుగుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,45,384 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో రోజువారీ కేసులు నమోదుకావడం దేశంలో ఇదే తొలిసారి. ఇదే సమయంలో 794 మంది కరోనాతో మరణించారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,32,05,926 చేరగా, మరణాల సంఖ్య 1,68,436కు పెరిగింది. ఇప్పటివరకు 1,19,90,859 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 10,46,631 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మహారాష్ట్రలో వారంతపు కర్ఫ్యూ
దేశంలో నమోదవుతున్న కరోనా కొత్త కేసుల్లో అత్యధికం మహరాష్ట్రలోనే వెలుగుచూస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర సర్కారు ఇప్పటికే ఆంక్షలు విధించింది. తాజాగా వారాంతపు లాక్డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. కరోనా ఉధృతి ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్డౌన్ విధించే అవకాశం లేకపోలేదని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ అన్నారు. ఇక మధ్యప్రదేశ్లోని అన్ని పట్టణ ప్రాంతాల్లో వారంతపు లాక్డౌన్ కొన సాగుతోంది. బెంగుళూరులో నైట్ కర్ఫ్యూ శనివారం నుంచి అమల్లోకి వచ్చింది.
కరోనాతో ఇద్దరు రాజకీయ నాయకుల మృతి
కరోనా కారణంగా మహారాష్ట్ర ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత రావు సాహేబ్ అంతపూర్కక్ మరణించారు. అలాగే, మాజీ ఎంపీ, బీజేపీ నేత శ్యామ్ చరణ్ గుప్తా కన్నుమూశారు. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, మాజీ జనరల్ సెక్రటరీ సురేశ్ భయ్యాజీ, ఒడిశా ఉప ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి అజిత్ మంగరాజ్లు కరోనా బారినపడ్డారు.
ప్రపంచవ్యాప్తంగా 29 లక్షల కరోనా మరణాలు
ప్రపంచ దేశాల్లో వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటివరకు కరోనా కారణంగా 29,14,590 మంది మరణించారని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. 13.45 కోట్ల మంది వైరస్ బారినపడ్డారు. కరోనా ప్రభావం అధికంగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా, బ్రెజిల్, భారత్, ఫ్రాన్స్, రష్యా దేశాలు టాప్-5లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో యూకే, టర్కీ, ఇటలీ, స్పెయిన్, జర్మనీలు ఉన్నాయి.