Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేఎంపీ జాతీయ రహదారిని బ్లాక్ చేసిన రైతన్నలు
- రైడ్డుపైనే బైటాయించి పెద్ద ఎత్తున నినాదాలు
- రైతాంగ పోరుకు స్థానికుల సంపూర్ణ సహకారం
- 135వ రోజుకు చేరిన దేశవ్యాప్త కర్షకపోరు
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకొచ్చిన సాగు వ్యతిరేక చట్టాలపై ఉధృతంగా పోరాడుతున్న రైతుల ఆందోళనలు శనివారం నాటికి 135వ రోజుకు చేరాయి. సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) పిలుపులో భాగంగా ఢిల్లీ సరిహద్దులో గల కుండ్లి మనేసర్ పల్వాల్ (కేఎంపీ) ఎక్స్‌ప్రెస్ వేతో పాటు ఘజియాబాద్‌లోని పల్వాల్ హైవేనూ రైతులు దిగ్బంధించారు. 24 గంటలపాటు జాతీయ రహదారిపైనే బైటాయించిన రైతులు సాగు చట్టాలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసన తెలిపారు. ఢిల్లీని కలిపే ఇతర రోడ్లను సైతం రైతులు పూర్తిగా బ్లాక్ చేశారు. ఈ సందర్భంగా మోడీ సర్కారుకు వ్యతిరేకంగా అన్నదాతలంతా నినాదాలు చేశారు. ఈ ఆందోళనా కార్యక్రమంలో రైతులు, రైతు కూలీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వీటితోపాటు రైతాంగ ఉద్యమ స్థావరాలైన సింఘు, ఘాజిపూర్, టిక్రీ లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కేంద్రంలోని మోడీ సర్కారుకు వ్యతిరేకంగా రైతులంతా శాంతియుతంగా నిరసన తెలిపారు. కాగా, రైతుల ఆందోళనను కేంద్ర ప్రభుత్వం, స్థానిక బీజేపీ ప్రభుత్వాలు హింసాత్మకంగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నాయని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) సమన్వయకర్త దర్శన్ పాల్ విమర్శించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక మీడియా బులిటెన్ విడుదల చేశారు. రైతులు ఉధతంగా పాల్గొన్న ఈ రహదారి దిగ్బంధానికి స్థానిక ప్రజానీకం సైతం సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలిపినట్టు వెల్లడించారు. హర్యానాలో రేవసన్ మేవత్‌లో సాగు చట్టాలకి వ్యతిరేకంగా కర్షకులు శాంతియుతంగా ఆందోళన తెలుపుతుంటే దారుణంగా కొట్టారనీ, అనంతరం వారిని అరెస్టు చేశారని తెలిపారు. ఈ ఘటనలో పోలీసుల దాష్టీకాన్ని ఆయన ఖండించారు. స్థానిక రైతుల ఒత్తిడితో అరెస్టు చేసిన వారిని విడుదల చేసినట్టు వెల్లడించారు. తమను భయపెట్టేందుకే పోలీసులు ఈ విధంగా లాఠీలతో దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేడు (ఆదివారం) ఢిల్లీ సరిహద్దుల్లోని రైతు ఉద్యమ వేదిక వద్ద సంఘ సంస్కర్త జ్యోతిబా ఫూలే జయంతి నిర్వహిస్తామన్నారు. దోపిడీరహిత సమాజం కోసం ఆయన చేసిన కృషిని గుర్తు చేస్తూ... వ్యవసాయ రంగంలో కూడా దోపిడీ లేని విధానాల కోసం పోరాటం చేస్తామన్న స్ఫూర్తితో ముందుకు వెళతామని దర్శన్ పాల్ మీడియాకు వెల్లడించారు.
ఉద్యమం ముగించి చర్చలకు రండి! : కేందమంత్రి తోమర్ అభ్యర్థన
రైతులు తమ ఆందోళనలను తీవ్రతరం చేయడంతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శనివారం మరోసారి రైతులను చర్చలకు ఆహ్వానించారు. రైతుల సమస్యలపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ విషయాన్ని తాము రైతు సంఘాలకు అనేకసార్లు చెప్పామని, అభ్యంతరం ఉన్న వాటిని మార్చేందుకు కూడా సిద్ధమేనని ప్రకటించారు. ఇప్పటికి 11 సార్లు చర్చలు జరిపామన్నారు. అందులో చట్టాలను రెండేళ్ల పాటు నిలిపివేసి, రైతులు లేవనెత్తిన అంశాలపై సవరణలు చేసేందుకు అంగీకరించామని తెలిపారు. కానీ రైతు సంఘాలు చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశాయన్నారు.