Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగోదశ ఎన్నికలు హింసాత్మకం
- పశ్చిమ బెంగాల్లో కేంద్ర బలగాల కాల్పుల్లో నలుగురు.. మరో ఘటనలో 18 ఏండ్ల యువకుడు మృతి
- టీఎంసీ, బీజేపీ పరస్పర ఆరోపణలు
- 4వ విడతలో 76.16 శాతం పోలింగ్ నమోదు
కూచ్‌బెహర్: పశ్చిమబెంగాల్ నాలుగో దశ ఎన్నికల్లో తుపాకీ తూటా పేలింది. కూచ్‌బెహర్ జిల్లాలోని కూచ్‌బెహర్ జిల్లాలోని సీతల్‌కుచ్ నియోజకవర్గంలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మరణించారు. ఈ ఘటనలతో జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీతల్కుచ్లోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద కేంద్ర బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. స్థానికులు ఎన్నికల సిబ్బందిపై దాడికి పాల్పడడంతో పాటు బలగాల వద్ద ఉన్న తుపాకులను లాక్కుకునేందుకు ప్రయత్నించడంతో ఆత్మరక్షణలో భాగంగా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) బలగాలు వారిపై కాల్పులు జరిపాయని సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) నివేదికతతో పాటు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. హింసాత్మక ఘటనల నేపథ్యంలో సీతల్కుచ్లోని 126వ పోలింగ్ కేంద్రంలో ఎన్నికలను ఈసీ వాయిదా వేసింది. మరోవైపు శనివారం నాడు నాలుగో దశలో భాగంగా 44 నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో కడపటి వార్తలు అందే సమయానికి 76.16 పోలింగ్ శాతం నమోదైంది.
ఉదయం 9.35 గంటల సమయంలో 126వ పోలింగ్ కేంద్రం వద్ద 50-60 మంది కూడిన గ్రూపు ఓటేసేందుకు వస్తున్న వారికి అడ్డుకోవడంతో పాటు క్విక్ రెస్పాన్స్ టీమ్(క్యూఆర్టీ)పై దాడికి పాల్పడిందనీ, పోలీసు వాహనాలను కూడా ధ్వంసం చేశారని.. ఈ సమయంలో వారిని చెదరగొట్టేందుకు క్యూఆర్టి ఐదు నుంచి ఆరు రౌండ్లు గాల్లో కాల్పులు చేసిందని బీఎస్ఎఫ్ నివేదిక పేర్కొంది. ఇది జరిగిన గంట సమయం తర్వాత 150 మంది కూడిన మరో గ్రూపు 186వ పోలింగ్ కేంద్రానికి చేరుకొని సిబ్బందిపై దాడి చేశారని తెలిపింది. హెచ్చరికలను పట్టించుకోకుండా డ్యూటీలో ఉన్న గార్డు, ఆశా కార్యకర్తపై దాడి చేయడమే గాక, విధుల్లో ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బందిని ఘెరావ్ చేస్తూ వారి చేతుల్లోని తుపాకులను లాక్కునేందుకు ప్రయత్నించడంతో.. సిబ్బంది కాల్పులు జరిపారని వివరణ ఇచ్చింది. దీంతో ఈ ఘటనలో నలుగురు మరణించగా, మరో నలుగురికి గాయాలయ్యాయని తెలిపింది. అంతకుముందు పతాన్తులి ఏరియాలోని 85 పోలింగ్ కేంద్రం వద్ద దుండుగుడు జరిపిన కాల్పుల్లో ఆనంద్ బర్మాన్ అనే 18 ఏండ్ల యువకుడు మరణించారు. ఈ ఘటనలో స్థానికంగా బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ రేగింది. బీజేపీనే ఈ హత్యకు పాల్పడిందని టీఎంసీ ఆరోపించగా, బాధితుడు తమ పార్టీకి చెందిన వ్యక్తే అని కాషాయ పార్టీ పేర్కొంది.
అమిత్‌షా రాజీనామా చేయాలి : మమత
తుపాకీ పేలుళ్లతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయా ఘటనలపై రాజకీయ దుమారం రేగింది. 24 పరగణాల జిల్లాలోని బదౌరియాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న సీఎం, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ మాట్లాడుతూ.. బీజేపీ హింసను ప్రేరేపిస్తుందని విమర్శించారు. కాల్పుల్లో మరణించిన నలుగురూ తమ పార్టీకి చెందిన కార్యకర్తలేనని ఆయన అన్నారు. కేంద్ర బలగాలు జరిపిన కాల్పులకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అమిత్‌షా చేసిన కుట్రలో భాగంగానే ఈ ఘటన జరిందని అన్నారు. ఘటన జరిగిన ప్రాంతానికి తాను ఆదివారం అక్కడకు వెళతానని, ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 వరకు నల్లబ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసనలు తెలపాలని టీఎంసీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాగా
సిలిగురిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. కూచ్‌బెహర్‌లో జరిగిన ఘటన దురదృష్టకరమని అన్నారు. కేంద్ర బలగాలపైకి మమత ప్రజలను రెచ్చగొడుతూ హింసను ప్రేరేపిస్తున్నారనీ, ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు మీరు చేస్తున్న ఇటువంటి ట్రిక్కులేవీ పనిచేయవని అన్నారు. ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు. భద్రతా బలగాలపై దాడులు చేస్తూ ఘెరావ్ చేయాలని స్వయంగా మమతనే ఈ విధమైన ఘటనలకు పురిగొల్పుతున్నారని ఆరోపిం
సీతారాం ఏచూరి ఖండన
కేంద్ర బలగాలు కాల్పులు జరిపి నలుగురిని చంపడాన్ని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఖండించారు. ఈ ఘటన దారుణమని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘం న్యాయ పర్యవేక్షణలో ఉన్నతస్థాయి విచారణ చేయించి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.