Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖనిజ తవ్వకాలపై కొత్త చట్టాన్ని తెస్తున్న మోడీ సర్కార్
- మైనింగ్బిల్లు-2021లో ప్రయివేటురంగానికి పెద్దపీట : రాజకీయ విశ్లేషకులు
- కొత్త నిబంధనలపై రాష్ట్రాలు అభ్యంతరం
- కేంద్రంలోని పాలకులు తమకు నచ్చిన ప్రయివేటు కంపెనీకి లీజ్‌కు ఇవ్వొచ్చు : నిపుణులు
- ఖనిజ తవ్వకాల్లో రాష్ట్రాల హక్కులకు ఎసరు
న్యూఢిల్లీ: భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో లక్షల కోట్ల రూపాయల విలువ జేసే ఖనిజ (బొగ్గు, ఇనుము, బాక్సైట్, మైకా..) నిక్షేపాలున్నాయి. ఇది దేశ సంపద. దేశ ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగించాల్సింది. అయితే దీనికి సంబంధించి రాష్ట్రాల హక్కుల్ని కాపాడేవిధంగా ఉన్న 1957 నాటి మైనింగ్ చట్టానికి మోడీ సర్కార్ కీలక సవరణలు చేసింది. 'మైన్స్ అండ్ మినరల్స్ (డెవలప్మెంట్, రెగ్యులేషన్)' సవరణ బిల్లు-2021ను ఇటీవలే పార్లమెంట్ ఆమోదించింది. పార్లమెంట్లో చర్చకు పెద్దగా అవకాశమివ్వకుండా మూజువాణీ ఓటుతో సవరణబిల్లును ఆమోదించటం వివాదాస్పదమైంది. సవరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు ఎంతగా డిమాండ్ చేసినా మోడీ సర్కార్ పట్టించుకోలేదు. కొత్త మైనింగ్ చట్టాన్ని అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఖనిజ సంపదను పరిరక్షించటం, భద్రంగా వాడుకోవటానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రయివేటు కంపెనీల దోపిడికి అవకాశం కల్పించారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దోపిడీకి కొత్త మార్గాలు
- బొగ్గు మినహా ఇతర ఖనిజ క్షేత్రాల కేటాయింపులు, లీజ్‌కు సంబంధించి వేలం వేయటం అంతా కూడా ఇప్పటివరకూ రాష్ట్రాల పరిధిలో ఉండేది. కొత్త మైనింగ్ బిల్లు ప్రకారం, సర్వ హక్కులూ కేంద్రం చేతిలోకి వెళ్లిపోనున్నాయి.
- నిర్దేశించిన కొన్ని ఖనిజ క్షేత్రాల వేలం పాటను రాష్ట్రాలు చేపట్టడానికి వీల్లేదని కొత్త మైనింగ్ చట్టంలోని సెక్షన్ 14 చెబుతోంది.
- ఖనిజ తవ్వకాలు, నిల్వ నేపథ్యంలో వ్యన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణానికి ఏమైనా నష్టం వాటిల్లుతుందా? అన్నది కేంద్రమే నిర్ణయిస్తుంది. రాష్ట్రాలకు ప్రమేయం లేదు.
- రాష్ట్ర పరిధిలో ఉన్న వ్యవసాయంపై సాగు చట్టాల్ని ఎలాగైతే చేసిందో, కేంద్రం ఏకపక్షంగా కొత్త మైనింగ్ బిల్లును తీసుకొచ్చిందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
- బొగ్గు, ఆస్బెస్టాస్ ఖనిజ తవ్వకాలను జరుపుతున్న కంపెనీలు, ఆ ఖనిజాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకోవచ్చు. ఇందుకోసంగానూ వారు అదనంగా రాయల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని కొత్త చట్టం చెబుతోంది.
అంతా ప్రయివేటు చేతుల్లోకి..
మనదేశంలోని బొగ్గు నిక్షేపాల్ని వందేండ్లు తవ్వినా తరిగిపోవని మోడీ సర్కార్ ప్రధానంగా ప్రచారం చేస్తోంది. అయితే..నాణ్యమైన బొగ్గు, తక్కువ ధరలో భారత్‌కు దిగుమతి అవుతుందని, అలాంటప్పుడు మన వనరుల్ని ఎందుకు తవ్వుకోవటమని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఉదాహరణకు బొగ్గు, ఇనుము క్షేత్రాల్ని ప్రభుత్వరంగ కంపెనీలకు కేటాయిస్తే, ఉత్పత్తి నిర్వహణ అంతా కూడా రాష్ట్రాలు, ప్రభుత్వ అధికారుల చేతుల్లో ఉంటుంది. అలాంటప్పుడు ...విద్యుత్, స్టీల్ ధరలు అందుబాటులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలా కాకుండా ప్రయివేటురంగానికి అప్పజెప్పాలని మోడీ సర్కార్ భావిస్తోంది.
రాష్ట్రాలకు లాభమేంటి?
ఇప్పటివరకూ ఉన్న నిబంధనల ప్రకారం, ఖనిజ తవ్వకాల లైసెంగ్స్ అంతా కూడా ప్రభుత్వ సంస్థలైన ఎన్ఎండీసీ, సెయిల్‌కు దక్కేవి. దీనివల్ల ఆయా రాష్ట్రాలకు టన్ను ఖనిజంపై ప్రీమియం లేదా రాయల్టీ ఆదాయంగా వచ్చేది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిషా, జార్ఖాండ్, మహారాష్ట్ర, గోవా, రాజస్థాన్..తదితర రాష్ట్రాలకు మైనింగ్‌వల్ల పెద్దమొత్తంలో రాబడి ఉంది. కొత్త మైనింగ్ చట్టం వల్ల ఈ పరిస్థితి ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్రంలో పాలకులుగా ఉన్నవారు తమకు నచ్చిన ప్రయివేటు కంపెనీకి లీజ్‌కు ఇచ్చే అవకాశముందని వారు చెబుతున్నారు. దీనిపై పై రాష్ట్రాలన్నీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.