Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఎఫ్ఆర్డీఏ నుంచి ఎన్పీఎస్ ట్రస్ట్‌ను వేరుచేసే యోచన
న్యూఢిల్లీ: మోడీ సర్కార్ అన్ని రంగాల్లో ప్రయివేటుకు పెద్ద పీట వేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అడ్డుగా ఉన్న చట్టాల్ని సవరిస్తూ పోతోంది. కేంద్రం తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. బీమారంగం వలే పెన్షన్లరంగంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమితిని 74శాతానికి పెంచే అవకాశం ఉన్నట్టు ఢిల్లీ అధికారిక వర్గాల నుంచి సమాచారం వెలువడింది. దీనికి సంబంధించి బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. బీమారంగంలోకి 74శాతం ఎఫ్‌డీఐలను అనుమతిస్తూ గత నెలలోనే పార్లమెంట్లో బిల్లు చట్టంగా మారిన విషయం తెలిసిందే. అలాగే..పెన్షన్‌రంగంలో ప్రస్తుతం ఉన్న 49శాతం ఎఫ్‌డీఐ పరిమితిని పెంచాలంటే 'పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ' (పీఎఫ్ఆర్డీఏ) యాక్ట్- 2013లో సవరణ చేయడానికి మోడీ సర్కార్ ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించిన సవరణ బిల్లును వచ్చే పార్ల మెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధమున్న ఉన్నతస్థాయి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ బిల్లులో పీఎఫ్ఆర్డీఏ నుంచి నేషనల్ పెన్షన్ స్కీమ్‌ను (ఎన్పీఎస్) వేరుచేసే సవరణను కూడా పొందుపరచ నున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఎన్పీఎస్ ట్రస్ట్ వద్ద ఉన్న అధికారాలు, విధులన్నింటినీ ఓ ఛారిటబుల్ ట్రస్ట్ లేదా కంపె నీల చట్టం పరిధిలోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది. పీఎఫ్ ఆర్డీఏ నుంచి దీన్ని పూర్తిగా వేరుచేసి 15మంది సభ్యులతో కూడిన ఓ బోర్డుని ఏర్పాటుచేయాలని యోచిస్తున్నారు.