Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాణిజ్యం, సముద్ర అంతర్భాగంలో ఖనిజ పంపదపై కన్ను
- ఈ ప్రాంతంపై పట్టుకోసం బ్రిటన్, ఫ్రాన్స్ ప్రయత్నాలు
- భారత ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించి..ప్రశ్నించే హక్కులేదన్న అమెరికా
- అమెరికాతో మైత్రి భారత్‌కే నష్టం : రాజకీయ విశ్లేషకులు
న్యూఢిల్లీ: లక్షద్వీప్‌కు సమీపంలో భారత ప్రాదేశిక జలాల్లో అమెరికా నౌక యుద్ధ విన్యాసాల చేపట్టడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని రక్షణరంగ నిపుణులు అంచనావేస్తున్నారు. అమెరికాతో భారత్ దోస్తీ..చివరికి చేదు ఫలితాల్నే ఇస్తుందని, అమెరికా నయవంచనకు మోసపోయే ప్రమాదముందని వారు హెచ్చరిస్తున్నారు. ఘటనపై అమెరికా నౌకా దళం చేసిన ప్రకటన భారత ప్రభుత్వవర్గాల్ని విస్మయపర్చింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, మోడీ సర్కార్‌లోని కీలక అధికారులు గందరగోళానికి గురయ్యారని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు. అమెరికాతో మైత్రి విషయంలో ప్రధాని మోడీ, ఆయన ప్రభుత్వం ఏర్పరచుకున్న భ్రమల్ని తాజా ఉదంతం పటాపంచలు చేస్తోందని, ఇకనైనా మేల్కోని తగినవిధంగా అమెరికాకు జవాబు ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. నాలుగుదేశాల కూటమి (అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్) నుంచి భారత్ వెంటనే బయటకు రావాలని, తద్వారా గట్టి సమాధానం ఇచ్చినవారం అవుతామని వారు చెబుతున్నారు.
ఇంతకీ ఏం జరిగింది?
అమెరికాకు చెందిన 'యుఎస్ఎస్ పాల్ జోన్స్' క్షిపణి విధ్వంసక నౌక లక్షద్వీప్‌కు సమీపంలో భారత ప్రాదేశిక సముద్ర జలాల్లో యుద్ధ విన్యాసాలు జరిపింది. ఏప్రిల్ 7న జరిగిన యుద్ధ విన్యాసాలపై అమెరికా నౌకాదళం ఏడో ఫ్లీట్ అధికారిక ప్రకటన చేశాకగానీ, జరిగిన సంగతి బయటకు రాలేదు. ''ఇది మాకు మామూలే. మేం చేసిందంతా కరెక్టే. మాకు ఇక్కడ ఉండటానికి, యుద్ధ విన్యాసాలు జరపడానికి హక్కులున్నాయి. అంతా అంతర్జాతీయ చట్టాల ప్రకారమే నడుచుకున్నా''మని అమెరికా నౌకాదళం ప్రకటన చేసింది. దీనిపై భారత్ అసంతృప్తి, ఆగ్రహాన్ని అమెరికా పట్టించుకోలేదు.
సర్వసాధారణంగా జరిగింది కాదు !
మధ్యప్రాచ్యంలో చమురు నిక్షేపాలు బయటపడ్డప్పుడు కూడా అమెరికా తన బలగాల్ని అటువైపు తిప్పింది. గల్ఫ్‌లో చమురు నిక్షేపాల్ని అమెరికా కైవసం చేసుకోవాలని, అక్కడి దేశాల్ని తన చెప్పుచేతుల్లోకి తీసుకోవాలని అమెరికా దౌత్యవేత్త జార్జ్ కెన్నెన్ ఆనాటి ప్రభుత్వాలకు విధానపరమైన సలహా ఇచ్చాడు. మధ్యప్రాచ్యంలో తన మాట వినాలని అమెరికా ఎలాంటి బెదిరింపులకు దిగుతుందో ఇప్పుడు అందరికీ తెలిసిందే. 21వ శతాబ్ధంలో ఆసియా నుంచి చైనా శక్తివంతమైన దేశంగా ఎదిగింది. అనేక రంగాల్లో అమెరికాకు సవాల్ విసురుతోంది. దీనిని ఎదుర్కోవడానికి వ్యూహాత్మకంగా దక్షిణ చైనా సముద్ర జలాలు, ఇటు హిందూ మహాసముద్రంలో అమెరికా యుద్ధ నౌకలు సంచరిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అంతేగాక దక్షిణ చైనా సముద్రం, హిందూ మహాసముద్రం అడుగుభాగంలో ఊహించలేనంత అత్యంత విలువైన ఖనిజ సంపద ఉందని, దీనిపై అమెరికా కన్నేసిందని నిపుణులు చెబుతున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంపై బ్రిటన్ సైతం దృష్టిసారించింది. అంతర్జాతీయ వాణిజ్యానికి ఈ ప్రాంతం భవిష్యత్తులో ముఖ్యకేంద్రంగా మారుతుందని బ్రిటన్ అంచనావేస్తోంది. '' నౌకాయానం హక్కులు, రక్షణ, భద్రతపరమైన సవాళ్లు (ఇండో-పసిఫిక్‌లో) బ్రిటన్‌కు ఎదురుకాకముందే..అక్కడికి కదలాలి'' అని బ్రిటన్ ప్రధానికి ఒక నివేదిక అందింది.
ఫ్రాన్స్ కూడా..
కొద్ది రోజుల క్రితం ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ లీ డ్రెయిన్ భారత్‌లో పర్యటించారు. ఆయన ఒక స్పష్టమైన లక్ష్యంతో ఈ పర్యటన చేశారని ఢిల్లీ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇరుదేశాలు కలిసి సంయుక్తంగా అరేబియా, హిందూ మహాసముద్రంలో యుద్ధ విన్యాసాలు జరపాలన్న ప్రతిపాదనను జీన్ లీ డ్రెయిన్ మోడీ సర్కార్ ముందు ఉంచారట. ఇందుకోసంగాను 42,500 టన్నుల ఫ్రాన్స్ యుద్ధ నౌక 'చార్లెస్ డీగాలే'ను పంపుతామని చెప్పారట. శక్తిమంతమైన దేశాల్లో ఒకటైన ఫ్రాన్స్ కూడా ఇండో-పసిఫిక్ ప్రాంతంపై పట్టుపెంచుకోవడానికి ప్రయత్నిస్తోందని, ఆ నేపథ్యంలో ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి పర్యటన సాగిందని నిపుణులు చెబుతున్నారు.
- తాజా ఉదంతంతో అమెరికా ఏం చెప్పాలనుకుంటోంది? అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
- ఒకటి..భారత ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించి, భారత్‌కు సవాళ్లు విసిరింది.
రెండోది..అంతర్జాతీయ చట్టాలు అనుమతిస్తాయని చెబుతూ..తన విమనాల్ని, యుద్ధ నౌకల్ని ఎక్కడికైనా అమెరికా పంపుతుంది.
- ట్రంప్ హయాంలో విదేశాంగమంత్రిగా పనిచేసిన మైక్ పాంపియో రూపొందించిన 'చైనా వ్యతిరేక' విధానంలో భాగంగానే తాజా యుద్ధ నౌక విన్యాసాలు జరిగాయని తెలుస్తోంది.
- క్వాడ్ కూటమిలో భారత్ చేరటంతోనే, ఇండో-పసిఫిక్‌లో అమెరికా ప్రయోజనాల కోసం భారత్ పనిచేస్తున్నట్టు లెక్క..అని రక్షణరంగ నిపుణులు భావిస్తున్నారు.