Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాల లేఖలు
- సరిపడా వ్యాక్సిన్లు సమకూర్చాలని వినతి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. నిత్యం లక్షల్లోనే కొత్త కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. మరో వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసే చర్యల్లో భాగంగా ఆదివారం దేశవ్యాప్తంగా ''టీకా ఉత్సవం'' ప్రారంభమైంది. అయితే, కేంద్రం టీకోత్సవానికి పిలుపునిచ్చింది కానీ టీకాలు లేకుండానే ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయి. ''టీకా ఉత్సవ్ నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామనీ, అయితే టీకాలు లేకుండా ఎలా?'' అంటూ ప్రధాని మోడీకి లేఖలు రాశాయి. వెంటనే సరిపడా టీకాలు అందించాలని అందులో పేర్కొన్నాయి. కేంద్ర ఆదేశాలు ఆచరణకు రావాలంటే ముందుగా తగినన్ని టీకాలు సమకూర్చాలని కోరుతున్నాయి. అలాగే, టీకాల నిల్వలు సైతం నిండుకున్నాయని పేర్కొన్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర, ఒడిశా, ఢిల్లీ, తెలంగాణ, ఎపీ, రాజస్థాన్, కేరళలలో వ్యాక్సిన్లు కొరత ఎక్కువగా ఉంది. జనాభాకు సరిపడా వ్యాక్సిన్లు పంపాలని కేంద్రాన్ని రాష్ట్రాలు కోరుతున్నాయి.
కాగా, కరోనా ప్రభావం అధికంగా ఉన్న మహారాష్ట్ర.. తమ వద్ద వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉందని ఇదివరకే ప్రకటించింది. ఇక ముంబయిలో ఏకంగా కరోనా టీకాలు అందిస్తున్న ప్రయివేటు కేంద్రాలు సోమవారం వరకు మూతపడ్డాయి. వెంటనే సరిపడా టీకాలు అందించాలని
కేంద్రాన్ని కోరితే ఊరికే ఆరోపణలు చేస్తుందంటూ కేంద్రంలోని నేతలు పేర్కొనడం గమనార్హం. ఇక తాజాగా తెలంగాణ సర్కారు ''టీకా ఉత్సవ్ నిర్వహించాలంటే తమకు తక్షణమే 30లక్షల డోసుల టీకాలు అందిం చాలని'' కోరింది. ఏపీ సైతం తమకు 25 లక్షల డోసులు కావాలని ప్రధానికి లేఖ రాసింది. రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీ, ఒడిశా, కేరళ రాష్ట్రాల సీఎంలు సైతం తమకు సరిపడా టీకాలు అందించాలని కేంద్రానికి లేఖలు రాశారు.