Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తగినన్ని పడకలు, వైద్య సౌకర్యాలుంటే ప్రజల పడిగాపులెందుకు?
- కరోనా విషయంలో ప్రభుత్వ చర్యలు సంతృప్తిగా లేవని వ్యాఖ్య
అహ్మదాబాద్: బీజేపీ పాలిత గుజరాత్ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న క్రమంలో.. రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విక్రమ్ నాథ్ విచారించారు. ఈ నేపథ్యంలోనే ఆయన కోవిడ్-19 కట్టడిలో ప్రభుత్వ చర్యలపై సంతృప్తిగా లేమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా పరిస్థితులు అదుపులోనే ఉన్నాయనే వాదనలతో కోర్టు ఏకీభవించలేదు. ఈ క్రమంలోనే పలు కీలక అంశాలను ప్రస్తావించింది. సామాన్యులకు కరోనా పరీక్ష రిపోర్టులు రావడానికి 4-5 రోజులు పడుతుండగా, ఆర్టీ-పీసీఆర్ పరీక్ష ద్వారా అధికారులు కొద్ది గంటల్లోనే రిపోర్టులను పొందుతున్నారు. కరోనా చికిత్సకు ఉపయోగించే రెమ్డెసివిర్ను అధిక ధరకు ఎందుకు విక్రయిస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. రోగులకు తగినంతగా వైద్య సదుపాయాలు, పడకలు, ఐసీయూలు ఉన్నాయని ప్రభుత్వం చెప్తున్నప్పుడు.. ప్రజలు ఎందుకు క్యూలో నిలబడాల్సి వస్తుందని ప్రశ్నించింది.
రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితిని సుమోటు కాగ్నిజెన్స్గా తీసుకొని ఫిల్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. కరోనాపై వస్తున్న మీడియా నివేదికలు చూస్తే ''రాష్ట్రం ఆరోగ్య అత్యవసర పరిస్థితుల వైపు పయనిస్తున్నదని'' కోర్టు పేర్కొన్నది. కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై గురువారం సమావేశమై చర్చించాలని న్యాయస్థానం సూచించింది. కాగా, కరోనా పరిస్థితిపై రాష్ట్ర హైకోర్టు ఇటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారించడం ఇది రెండోసారి. మొదటి పిటిషన్ గత ఏడాది దాఖలైంది. ఇదిలా ఉండగా, గుజరాత్లో తాజాగా 5,469 కొత్త కరోనా కేసులు నమోదుకావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,47,495కు పెరిగింది. మరణాలు 4800 దాటాయి.