Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఏఏ-వ్యతిరేక నిరసనకారుడిపై ఆరోపణలు కొట్టేసిన మద్రాస్ హైకోర్టు
న్యూఢిల్లీ : దేశంలో ప్రతి పౌరుడికి నిరసన తెలిపే హక్కు, భావ వ్యక్తికరణ హక్కు ఉందని ఒక కేసు విచారణలో మద్రాస్ హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సీఏఏ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిపై పోలీసులు నమోదుచేసిన ఆరోపణల్ని హైకోర్టు కొట్టేసింది. తమకు అందిన నివేదిక ప్రకారం..సీఏఏ వ్యతిరేక నిరసనలు శాంతియుతంగా జరిగాయని, నిరసనల అనంతరం ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదని తేలిందని ధర్మాసనం పేర్కొంది. కన్యాకుమారికి చెందిన పిటిషనర్ జాఫర్ సాథిక్పై పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్ను రద్దుచేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. కన్యాకుమారిలో గత ఏడాది మార్చిలో జరిగిన సీఏఏ వ్యతిరేక నిరసనల్లో ట్రాఫిక్కు తీవ్ర ఆటంకం ఏర్పడిందని బూతాపాండీ పోలీస్ స్టేషన్లో జాఫర్ సాథిక్పై కేసు నమోదుచేశారు. దీనిపై జాఫర్ సాథిక్ హైకోర్టును ఆశ్రయించగా, జస్టిస్ ఆర్.హేమలతా నేతృత్వంలోని ధర్మాసనం పై విధంగా వ్యాఖ్యానించింది. ఎఫ్ఐఆర్ను రద్దుచేయాలని పోలీసుల్ని ధర్మాసనం ఆదేశించింది. ఇలాంటిదే మరో కేసులో, కొద్ది రోజుల క్రితం సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన ఇద్దరు నిరసనకారులపై పోలీసులు కేసులు నమోదుచేయగా, మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం ఆ ఆరోపణల్ని కొట్టేసింది.