Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు నేత రాకేష్ తికాయత్
న్యూఢిల్లీ : కేంద్రం చర్చలకు ఆహ్వానిస్తే.. తాము సిద్ధంగా ఉన్నామనీ, అయితే తమ డిమాండ్లల్లో మాత్రం ఏ మార్పూలేదని రైతు నేత రాకేష్ తికాయత్ అన్నారు. సోమవారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య చర్చలు తిరిగి ప్రారంభం కావాలని అన్నారు. 2020 నవంబరు నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమంలో ఉన్న రైతులకు ప్రాతినిధ్యం వహిస్తున్న రైతు సంఘాల వేదిక సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం)ను చర్చలకు ప్రభుత్వం ఆహ్వానించాలన్నారు. జనవరి 22న చివరిగా చర్చలు జరిగాయనీ, చర్చలు తిరిగి ప్రారంభమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తమ డిమాండ్లు మారవని స్పష్టం చేశారు. మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు హామీ ఇస్తూ కొత్త చట్టం తీసుకురావాలనే డిమాండ్లకే తమ ప్రాధాన్యత ఉంటుందన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులతో తిరిగి చర్చలు ప్రారంభించాలని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ కోరిన నేపథ్యంలో రాకేష్ తికాయత్ స్పందించారు. కరోనా వైరస్ కేసుల పెరుగుదల దేశవ్యాప్తంగా కనిపిస్తున్నదనీ, హర్యానాలోనూ పరిస్థితి అధ్వానంగా మారుతున్నదనీ, ఢిల్లీ, హర్యానా సరిహద్దుల్లో రైతుల ఆందోళనలపై ఆందోళన చెందుతున్నానని విజ్ అన్నారు. రైతులతో చర్చలు జరిపి, పరిష్కారం చూపాలని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను కోరారు.