Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్-19 కేసుల్లో బ్రెజిల్‌ను వెనక్కినెట్టేసిన భారత్
- ఒక్కరోజే 1,68,912 కేసులు, 904 మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనారక్కసి రంకెలేెస్తోంది. ఏ మాత్రం తగ్గేదిలే అంటూ తన ప్రతాపాన్ని చూపిస్తూ.. విజృంభణ కొనసాగిస్తోంది. రికార్డు స్థాయిలో నిత్యం లక్షకు పైగా కొత్త కేసులు నమో దవుతుండటంతో ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదైన దేశాల జాబితాలో బ్రెజిల్‌ను (13,482, 543 కేసులు) వెనక్కినెట్టి భారత్ (1,35,27,717) రెండో స్థానంలోకి చేరింది. ఈ జాబితాలో అమెరికా మొదటిస్థానంలో ఉంది. అయితే, ఆ రెండు దేశాలతో పోలిస్తే ప్రస్తుతం భారత్‌లో కేసులు గణనీయంగా పెరుగుతున్నా యని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 136,758,639 కేసులు నమోదు కాగా, అందులో
2,951,777 మంది మరణించారు.
ఇదిలా ఉండగా, సోమవారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 1,68,912 మందికి కరోనా సోకింది. దేశంలో ఒకేరోజు నమోదైన అత్యధిక కేసులు ఇవే. అలాగే, కరోనాతో 904 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,70,179కి చేరగా, పాజిటివ్ కేసులు 1,35,27,717కు చేరాయి. ఇప్పటివరకు మొత్తం 1,21,56,529 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 12,01,009 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారంరోజుల్లోనే 9 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదుకావడం వైరస్ ఉధృతికి అద్దం పడుతోంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్-19 పరీక్షలు, వ్యాక్సినేషన్‌ను అధికార యంత్రాంగం ముమ్మరం చేసింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 25,78,06,986 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. ఆదివారం ఒక్కరోజే 11,80,136 శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపింది. కాగా, 10,45,28,565 మందికి టీకాలు అందించారు.
ఐదు రాష్ట్రాల్లో 10 వేలకు పైగా కొత్త కేసులు
దేశంలో కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగ మహారాష్ట్రలోనే (63,294) నమోదయ్యాయి. ఐదు రాష్ట్రాల్లో 10 వేలకు పైగా కొత్త కేసులు నిర్ధారణయ్యాయి. ఐదువేలకు పైగా కొత్త కేసులు 10 రాష్ట్రాల్లో వెలుగు చూశాయి. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బెంగాల్, ఛత్తీస్‌గఢ్, రాజాస్థాన్లు టాప్-10లో ఉన్నాయి. కరోనా మరణాలు సైతం ఈ రాష్ట్రాల్లోనే అధికంగా నమోదవుతున్నాయి.
కరోనా దెబ్బకు 10,12 పరీక్షలు వాయిదా
మహారాష్ట్రలో కరోనా కల్లోలం రేపుతోంది. నిత్యం 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతుండటంతో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను సైతం విధించింది. తాజాగా విద్యాసంస్థలు, పరీక్షలకు సంబంధించి కీలక నిర్ణ యం తీసుకుంది. రాష్ట్ర బోర్డు పరిధిలోని 10, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు విద్యామంత్రి వర్ష గైక్వాడ్ వెల్లడించారు. 12వ తరగతి పరీక్షలను మే నెలాఖరులో, 10వ తరగతి పరీక్షలను జూన్‌లో నిర్వహిస్తా మని తెలిపారు. అలాగే, ఇప్పటికే ప్రకటించిన పరీక్షల తేదీలను మార్చాలని కోరుతూ సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, కేంబ్రిడ్జి బోర్డులకు లేఖలు రాస్తామని చెప్పారు.
దేశంలో మరో వ్యాక్సిన్‌ను గ్రీన్ సిగ్నల్
దేశంలో ఒకవైపు కరోనా విజృంభిస్తుండటం, మరోవైపు వ్యాక్సిన్ల కొరత ఆందోళన కలిగిస్తున్నది. ఇలాంటి తరుణంలో కాస్తా ఊరట కలిగించేలా.. మరో వ్యాక్సిన్ అందుబాలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే రష్యా అభివృద్ధి చేసిన కరోనా టీకా 'స్పుత్నిక్ వి'ని అత్యవసర వినియోగానికి ఎక్స్పర్ట్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో దేశంలో ఆమోదం పొందిన మూడో కరోనా వ్యాక్సిన్‌గా స్పుత్నిక్ వి నిలిచింది. ఇప్పటికే కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు ఇస్తున్నారు.