Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రసూతి ప్రయోజనాలు దక్కట్లే
- దేశంలో మహిళల దుస్థితిపై తాజా సర్వే
న్యూఢిల్లీ : భారత్‌లో మెజారిటీ మహిళలు ఇప్పటికి ప్రసూతి ప్రయోజనాలను పొందడం లేదు. ఆ హక్కులు పొందకుండా వారు అణచి వేతకు గురవుతున్నారు. ఆర్థికవేత్తలు జీన్ డ్రీజ్, రీతికె ఖేరా, అన్మోల్ సొమంచి లు ఇటీవల నిర్వహించిన సర్వేలో ఇది వెల్లడైంది. 2019లో భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రెగెంట్, నర్సింగ్ మహిళలకు సంబంధించిన 'జచ్చా బచ్చా సర్వే (జబ్స్) ఆధారంగా ఆర్థికవేత్తలు తమ అధ్యయనాన్ని జరిపారు. ఈ సర్వేను భారత్‌లోని ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, యూపీ వంటి ఆరు రాష్ట్రాల్లో జరిపారు. సర్వేలో భాగంగా అంగన్వాడీలలో మహిళలను వారు ఎదుర్కొంటున్న పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. జాతీయ ఆహార భద్రత చట్టం , 2013 కింద భారతీయ మహిళలు మెటర్నిటీ బెనిఫిట్స్ (ప్రసూతి ప్రయోజనాలు ) పొందడానికి అర్హులు. మెటర్నిటీ బెనిఫిట్ (అమెండ్మెంట్) యాక్ట్, 2017 ప్రకారం సెలవులతో కూడిన ప్రసూతి సెలవులను 12 నుంచి 26 వారాలకు పెంచారు. అయితే, ఈ ప్రయోజనాలను ఆర్గనైజ్డ్ సెక్టార్‌లోని కొంత మంది మహిళలు మాత్రమే పొందుతున్నారు. అయితే, భారత్‌లో మెటర్నిటీ లీవ్‌కు సంబంధించిన నిబంధనలు ఉదారంగా ఉన్నాయని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. కేంద్రం 2017లో కొత్త మెటర్నిటీ ప్రయోజన పథకాన్ని ప్రారంభించింది. 2017-18లో ఈ పథకానికి కేటాయించింది మాత్రం రూ. 2700 కోట్లు కావడం గమనార్హం. అయితే, ఈ మొత్తం చాలా తక్కువనీ, ఇందుకు ఏడాది రూ. 14వేల కోట్లు అవసరమని ఆర్థికవేత్తలు సూచించారు.
చాలా మంది మహిళలు చక్కని ఆహారం, ఎక్కువ విశ్రాంతి, ఆరోగ్య సంరక్షణ విషయంలో తగిన శ్రద్ధతో లేరనీ, వారిని అటువైపు శ్రద్ధ వహించే చర్యలు ప్రభావవంతంగా జరగడంలేదని సర్వేలో వెల్లడైంది. యూపీలో 48శాతం మంది గర్భవతులు, 39శాతం మంది నర్సింగ్ మహిళలు ప్రెగెన్సీ సమయంలో తాము బరువు పెరిగామా? లేదా? అన్న విషయంపై కనీస అవగాహన లేదని సర్వే పేర్కొన్నది. అయితే, కేంద్రం.. మహిళలు ప్రసూతి ప్రయోజనాలు కల్పించే ఉద్దేశంతో బడ్జెట్లో నిధులు కేటాయించామని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉన్నదని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ఇప్పటికైనా కండ్లు తెరవాలని వారు సూచించారు.