Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో ధరలు అమాంతం పెరుగుతుండగా.. మరోవైపు డిమాండ్ లేక పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయింది. ఇందుకు నిదర్శనం సోమవారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణంకాలే. ప్రస్తుత ఏడాది మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ (సీపీఐ) ఏకంగా 5.52 శాతానికి ఎగిసి.. నాలుగు మాసాల గరిష్ట స్థాయికి చేరింది.
ముఖ్యంగా ఇంధన ధరలు భారీగా పెరగడమే ఇందుకు కారణమని ప్రభుత్వ గణంకాలు తెలిపాయి. 2021 ఫిబ్రవరిలో సీపీఐ 5.03 శాతంగా నమోదయ్యింది.
గడిచిన మాసంలో అహారోత్పత్తుల ద్రవ్యోల్బణం 4.94 శాతానికి పెరిగింది. ఇంతక్రితం ఫిబ్రవరిలో ఇది 3.87 శాతంగా ఉంది. అహారోత్పత్తుల్లో ముఖ్యంగా అహారం, పానియాల ధరలు 5.24 శాతం పెరిగాయి. కాగా కూరగాయల ధరలు మాత్రం 6.27 శాతం నుంచి 4.83 శాతానికి తగ్గాయి. మార్చిలో ముఖ్యంగా ఇంధన ధరలు 4.50 శాతం ఎగిశాయి.
ఫిబ్రవరిలో ఇది 3.53 శాతంగా నమోదైంది. ఇటీవల దేశంలో వంట నూనెల ధరలు కాలిపోతున్న విషయం తెలిసిందే.
పలు కంపెనీలు కిలో నూనెను ఏకంగా రూ.180కు విక్రయిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో ద్రవ్యోల్బణం ఎగిసిపడుతుండటంతో ఇటీవల ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలోనూ వడ్డీ రేట్లను యథాతథంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
పారిశ్రామికం డీలా..
వరుసగా రెండో మాసంలోనూ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) పడిపోయింది. ప్రస్తుత ఏడాది ఫిబ్రవరిలో ఐఐపీ మైనస్ 3.6 శాతం క్షీణించిందని కేంద్ర గణంకాల శాఖ వెల్లడించింది. ఇంతక్రితం మాసంలో ఇది 1.6 శాతం పతనం కాగా.. 2020 ఫిబ్రవరిలో 4.5 శాతం వృద్ధిని సాధించింది. గడిచిన ఫిబ్రవరిలో తయారీ రంగం ఉత్పత్తి 3.7 శాతం పతనం కాగా.. గనులు 5.5 శాతం క్షీణించింది.
గడిచిన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి కాలంలో దేశ ఐఐపీ ఏకంగా మైనస్ 11.3 శాతం పడిపోయింది. 2019-20 ఇదే కాలంలో 1 శాతం పెరిగింది. ప్రభుత్వ ఆర్థిక విధానాలు ప్రజల కొనుగోలు శక్తిని హరించేలా చేయడంతో పారిశ్రామిక ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
జీఎస్టీ వల్ల పన్ను రేట్లు పెరగడం, గతేడాది సరైన కార్యచరణ లేకుండా లాక్డౌన్ ప్రకటించడం వల్ల అనేక మంది ఉద్యోగాలు, ఉపాది కోల్పోయారు. ఇవి పారిశ్రామిక రంగంపై తీవ్రంగా ప్రభావం చూపాయి.