Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నష్టం..రూ. 30 వేల కోట్లు
- కరోనా దెబ్బకు సగం కూడా నిండని రిసార్ట్స్
- బ్యాక్ వాటర్‌లో ఆగిన హౌస్ బోట్లు..
కన్నూర్: కేరళ అనగానే జలజలపారే నదులు.. కొబ్బరిచెట్లమధ్య అందమైన సోయగాలు..ప్రకృతిసిద్ధమైన వాతావరణం పర్యాటకుల్ని ఇట్టే ఆకర్షిస్తోంది. అయితే కరోనా విలయం మొదలయ్యాక..కేరళ పర్యాటకానికి ఊహించని దెబ్బమీద దెబ్బతగులుతూనేఉన్నది.ప్రకృతి విపత్తులు సృష్టించిన విధ్వంసం నుంచి నెమ్మదిగా కోలుకున్నామనుకున్నలోపే..కోవిడ్..19 కోరలు విప్పింది. అప్పటివరకూ.. 2019 లో కేరళ అందాలను తిలకించటానికి 1.96 కోట్ల మంది వచ్చారు. అందులో సుమారు 12 లక్షల మంది విదేశీ పర్యాటకులు ఉన్నారు.
కరోనా విజృంభించాక విదేశీ పర్యాటకులు ముఖంచాటేశారు. ఇక దేశీయ పర్యాటకులలో 15శాతం నుంచి 20 శాతం మాత్రమే వస్తున్నట్టు అధికారికలెక్కలు ధ్రువీకరిస్తున్నాయి.
టూరిస్టులు వస్తేనే...
అనూప్ అనే అతను కొచ్చిలో టూరిస్ట్ గైడ్‌గా పనిచేస్తాడు.దేశ,విదేశాలనుంచి వచ్చే పర్యాటకుల్ని తీసుకెళ్లి..ఆ కట్టడాలు..ప్రకృతి అందాలవెనుక ఉన్న రహస్యాలను వివరించేవాడు. ఇలా గైడ్‌గా తన బాధ్యతలు నిర్వర్తించి రోజూ వెయ్యినుంచి రెండువేల రూపాయలవరకు సంపాదించుకునేవాడు. కరోనా వచ్చాక.. ఇప్పుడు అతనికి వంద రూపాయలు కూడా గగనమైపోయింది. పస్తులుండలేక.. తను చదువుకున్న చదువును..పిల్లలకు బోధిస్తున్నాడు. వీటితోపాటు కొన్ని సామాజిక కార్యక్రమాలను షురూచేశాడు.
కేరళపర్యాటకం నుంచే 30శాతం జీఎస్టీ ఆదాయం
దేశంలోని అతి ప్రాముఖ్యమైన పర్యాటక ప్రదేశాలలో కేరళ ఒకటి. కేరళ రాష్ట్ర జీఎస్టీ ఆదాయంలో 30 శాతం పర్యాటక రంగం వాటా ఉండటం గమనార్హం. ఏడాదికిపైగా స్వైరవిహారం చేస్తున్న కరోనా రాష్ట్ర పర్యాటక రంగాన్ని ఛిన్నాభిన్నం చేసింది. కేరళ పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకారం, 2019 లో 1.96 కోట్ల మంది పర్యాటకులు రాష్ట్రాన్ని సందర్శించారు. వీరిలో 1.83 కోట్లు దేశీయ పర్యాటకులుంటే.. 11.89 లక్షల మంది విదేశీ పర్యాటకులు ఉన్నారు. 2019 లో ప్రభుత్వానికి పర్యాటక రంగం నుంచి రూ.45 వేల కోట్ల ఆదాయం వచ్చింది. కోవిడ్ కారణంగా పర్యాటక రంగానికి గతేడాది రూ .30,711 కోట్ల నష్టం వాటిల్లిందని కేరళ ప్రభుత్వం తెలిపింది.
హౌటల్ బిజినెస్ కూడా డల్..
కరోనాకు ముందు హౌటల్స్ నిండుగా ఉండేవి. రోజుకూ 1800 నుంచి రెండువేలవరకూ రూమ్ లను అద్దెకిచ్చేవారని ఎర్నాకులంలోని బిజినెస్హౌటల్ మేనేజర్ అంజలి తెలిపారు. ఇపుడు ఆక్యుపెన్సీ 50శాతానికి తగ్గిందని వివరించారు.
బీచ్, బ్యాక్ వాటర్ ప్రాంతాలకు భారీగా పర్యాటకులు..
కేరళలో అడుగుపెట్టాక.. చాలా మంది పర్యాటకులు బీచ్, బ్యాక్ వాటర్ ఆనందించడానికి వస్తారు. కానీ ఇపుడు ఎటుచూసినా నిశ్శబ్దవాతావరణం నెలకొంది. త్రివేండ్రం తమిళనాడు సరిహద్దు, కర్నాటక సరిహద్దు యొక్క ఉత్తరవైపు, ఆ పక్కనే ఉన్న కాసరగోడ్ జిల్లా పరిసరాలన్నీ బోసిపోతున్నాయి.
ఆయా మాసాల్లోనే ఎక్కువగా..
నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో దేశీయ పర్యాటకులు ఎక్కువగా వస్తారు.కొంతమంది పర్యాటకులు మే-జూన్ మాసాల్లో రుతుపవనాలను ఆస్వాదించడానికి వస్తారు. ఆగస్టు-సెప్టెంబర్‌లో మాత్రం విదేశీయులు ఎక్కువగా సందర్శిస్తారు.
కన్నూర్ డ్రైవ్ బీచ్
కన్నూర్‌లోని డ్రైవ్ బీచ్.. ఇది ఆసియాలోనే అతిపెద్ద బీచ్‌గా పరిగణిస్తారు. మహామ్మారి రాకముందు.. భారీ సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వచ్చేవారు.కానీ ఇపుడు పరిస్థితి తారుమారైంది.ఇక మలప్పురానికి చెందిన మహ్మద్ సమీర్ కేరళలో టాక్సీ నడుపుతున్నాడు. పర్యాటకులు వస్తుంటే..పైసలకు ఎలాంటి ఇబ్బం దులు ఉండేవికావు. ఇపుడు పర్యాట కులు రాకపోవటంతో.. ప్రతినెలా రూ.15వేలు అప్పు చేయాల్సి వస్తున్నదని సమీర్ చెప్పాడు.
మట్టంచెరిలోని జ్యూట్ టౌన్ లో ఉన్న సినగోగ్ ప్రాంతాన్ని విదేశీ పర్యాటకులు ఎక్కువగా సందర్శించేవారు.
కరోనాకు ముందు ప్రతిరోజూ సగటున రెండు నుంచి మూడు వేల మంది ఇక్కడకు వస్తే.. వారిలో 60శాతం మంది విదేశీయులు ఉన్నారని సినగోగ్ యొక్క కేర్ టేకర్ కెజె జారు చెప్పారు. ఇజ్రాయెల్, అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా వంటి దేశాల నుంచి ఎక్కువ మంది విదేశీయులు వచ్చారు. కానీ ఇప్పుడు 50 నుంచి 100 మంది మాత్రమే వస్తున్నారు. అది కూడా దేశీయ పర్యాటకులు ఉంటున్నారు.
ఇక్కడి జ్యూయిస్ టౌన్ వీధిలో మసాలా మార్కెట్లు, చాలా షాపులు ఉన్నాయి, కానీ కొనేవారులేక.. ఒంటరిగా కూర్చుని కాలాక్షేపం చేయకతప్పటంలేదని దుకాణదారులు అంటున్నారు. సాంప్రదాయ దుకాణంలో ఉషా అనే మహిళ పనిచేస్తున్నగి, ఆ షాపులో.. 15 మంది ఇక్కడ సిబ్బందిగా ఉన్నారనీ, ఇప్పుడు కేవలం ఐదుగురు మాత్రమే మిగిలారని తెలిపింది.వినియోగదారులెవరూ రావడం లేదు. ఇంతకు ముందు 15 నుంచి రూ.20 వేల విలువైన వస్తువులు అమ్ముడయ్యాయి, ఇప్పుడు రూ.1000 అమ్మడం కష్టమవుతున్నదని వివరించింది.
గాడ్స్ ఆన్ కంట్రీగా పిలిచే కేరళ పర్యాటక రాష్ట్రం.. ప్రకృతి విపత్తుల నుంచి నెమ్మదిగా బయటపడుతుంటే... కరోనా మరో విపత్తుగా తమ బతుకుల్ని మరింతఅగాధంలోకి నెట్టేసిందని పర్యాటకం మీద ఆధారపడిన కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఖాళీగా రిసార్ట్స్
కన్నూర్‌లో రోషన్ హారిస్‌కు హెరిటేజ్ రిసార్ట్ ఉన్నది. రిసార్ట్అంతా ఖాళీగా ఉన్నది. కరోనాకు ఈ రిసార్ట్‌లో గదులకోసం ఒక నెల ముందుగా బుక్ చేసుకునేవారని రోషన్ చెప్పారు. కానీ ఇపుడు ఎవరూరావటంలేదని తెలిపాడు. ముఖ్యంగా ఫారిన్ టూరిస్టులు వచ్చి.. ఇక్కడ నెలల తరబడి ఉండేవారు. టే..ఇక్కడ యోగా నుంచి ఆయుర్వేద మసాజ్ వరకు ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి.
అలెప్పి జిల్లాకు ఓ ప్రత్యేకత...
కేరళలోని అలెప్పిజిల్లా అనగానే.. హౌస్బోట్లు గుర్తుకొస్తాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. కానీ ఇపుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. హౌస్‌బోట్ యజమానులు మరమ్మతులు కూడా చేయలేకపోతున్నారు.. కనన్ అనే హౌస్ బోట్ యజమాని వద్ద గతంలో మూడు హౌస్బోట్లు ఉండేవి. కాని వాటిలో రెండు నిరూపయోగంగా పడిఉన్నాయి. ఉన్న ఓ బోట్లో మాత్రం కొంతమంది స్థానిక పిల్లలు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి వస్తున్నారు, కాబట్టి బుకింగ్ జరిగింది. ఏదేమైనా, హౌస్ బోట్ యొక్క గదులు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి. బోట్లకు పెట్టే డీజిల్ ఖర్చుకూడా రావటంలేదని కనన్ తెలిపాడు.
డచ్ ప్యాలెస్..
కొచ్చిలోని డచ్ ప్యాలెస్‌ను సందర్శించటానికి ప్రతిరోజూ 250 నుంచి 500 మంది విదేశీయులు వచ్చేవారు. కానీ ఏడాదినుంచి ఆపరిసరాలకు ఎవరూరావటంలేదని టూరిస్ట్‌గైడ్ తెలిపారు.
15లక్షలమందికి ఉపాధి...
కేరళలోని పర్యాటక రంగంలో 15 లక్షల మంది ఉద్యోగులున్నారని సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ రీసెర్చ్ (సీపీపీఆర్) చైర్మెన్ డాక్టర్ ధనురాజ్ చెప్పారు. మునుపటితో పోలిస్తే ప్రస్తుతం స్థానిక పర్యాటకులలో 15 నుంచి 20శాతం మాత్రమే వస్తున్నారు. విదేశీ పర్యాటకులు ఏడాది కాలంగా రాష్ట్రానికి రాలేదని సమాచారం.
ఇప్పుడిప్పుడే పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉన్నట్టు కనిపిస్తున్నది.కానీ ఇప్పుడు కరోనా సెకండ్‌వెవ్ సంక్షోభం మరోసారి ఉపద్రవంగా వచ్చిపడిందని ధనురాజ్ తెలిపారు.
పర్యాటకమంటేనే.. ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటుంది. ప్రస్తుతం టూరిస్టులు రాకపోవడం వల్ల బోట్ మెన్, ఆటోలు, టాక్సీలు, హౌటళ్ళు, రెస్టారెంట్లు, అమ్మకం దారులు, దుకాణదారులపైనే ఎక్కువ ప్రభావం చూపుతున్నది. ఎందుకంటే ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నది వారే కాబట్టి. ఇది కాకుండా కేరళలో సుమారు 4.5 మిలియన్ల మంది వలస కార్మికులు పనిచేస్తున్నారు. వారిలో పెద్ద సంఖ్యలో రెస్టారెంట్లు, దుకాణాలలో పనిచేసే కార్మికులు ఉన్నారు. కోవిడ్ తరువాత వీరిలో ఎక్కువ మంది ఇక్కడకు వలస వచ్చారు. సుమారు 20 నుంచి 25 లక్షల మంది వలస కార్మికులు ఇక్కడికి వచ్చినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి.