Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని మోడీతో ఫ్రాన్స్ విదేశాంగమంత్రి సమావేశం రద్దు
- ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోడీ ప్రాధాన్యత
న్యూఢిల్లీ : గతకొన్ని వారాలుగా భారత పర్యటనకు వస్తున్న విదేశాంగ మంత్రులు, వారి బృందాలతో ప్రధాని మోడీ సమావేశాలు రద్దు అవుతున్నాయి. కోవిడ్-19 వైరస్ ప్రభావమా, ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి ప్రాధాన్య తనా.. తెలియదుగానీ, ప్రధాని కార్యాలయం ఆయా సమావేశాలన్నీ రద్దు చేస్తోం ది. తాజాగా భారత ప్రధాని మోడీ, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ లెడ్రెయిన్ మధ్య జరగాల్సిన కీలక సమావేశం కొద్ది నిమిషాల ముందు రద్దు అయ్యింది. భారత విదే శాంగమంత్రి, ఇతర కీలక నేతలతో ఆయన సమావేశాలు కూడా రద్దు అయినట్టు ఫ్రాన్స్ రాయబార కార్యాలయం తెలిపింది. కోవిడ్-19 వైరస్ విజృంభణ నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులు కారణమని అధికారులు చెబుతున్నారు.
భారత్ పర్యటనకు వస్తున్న వివిధ దేశాల కీలకనేతలతో ప్రధాని మోడీ సమావేశం కావడానికి పెద్దగా ఆసక్తిచూపటం లేదని, చివరి నిమిషంలో అనేక సమావేశాలు రద్దు అవుతున్నాయని ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని మోడీ, మాల్దీవుల విదేశాంగ మంత్రితో జరగాల్సిన సమావేశం కూడా ఇటీవల కొన్ని గంటల ముందు రద్దు అయ్యింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ బిజీగా ఉండటమే దీనికి కారణమని ప్రధాని కార్యాలయ అధికారులు చెబుతున్నారు. ఇటీవల దాదాపు 10దేశాలకు చెందిన విదేశాంగమంత్రులు భారత్కు వచ్చారని, ఇందులో ఏ ఒక్కరితోనూ భారత ప్రధాని మోడీ సమావేశం జరగలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. రష్యా, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ విదేశాంగమంత్రులు కూడా ప్రధాని మోడీతో సమావేశం కాకుండానే వెనుతిరిగి వెళ్లిపోయారని తెలిసింది. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షా శ్రింగ్లే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా, ఆయనలో వైరస్ లక్షణాలు బయటపడ్డాయని, దాంతో పీసీఆర్ టెస్ట్ చేయించుకున్నారని తెలిసింది. దాంతో ఆ శాఖలోని ఏ అధికారినీ కూడా ప్రధాని కార్యాలయం దగ్గరకు రానీయటం లేదని సమాచారం. హర్షా శ్రింగ్లే వైరస్ టెస్ట్ ఫలితాలు ఇంకా రాకపోవటంతో ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి పర్యటన షెడ్యూల్ ప్రకారం సాగలేదని తెలిసింది.
భారత్లో మూడు రోజుల పర్యటన నిమిత్తం లీడ్రెయిన్ ఏప్రిల్ 12న న్యూఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం ప్రధాని మోడీతో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరపాల్సి ఉంది. కోవిడ్ నిబంధనల కారణంగా ఈ సమావేశం రద్దు అయ్యిందని, అయితే ప్రధాని కార్యాలయం నుంచి మళ్లీ పిలుపువస్తే ఇరువురుమధ్య సమావేశం ఉంటుందని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం తెలిపింది. ఫ్రాన్స్-భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్య అంశాలపై చర్చించేందుకు లీడ్రెయిన్, ఆయన బృందం భారత్కు చేరుకుంది. అయితే ఇక్కడ కోవిడ్ కేసుల ఉధృతి కారణంగా షెడ్యూల్ అంతా తారుమారు అయ్యిందని భారత విదేశాంగ శాఖలోని ఉన్నతాధికారులు చెబుతున్నారు.