Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనంగా రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం
న్యూఢిల్లీ :మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధర (ఎంఎస్పి)కు చట్ట బద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కెఎం) ఆధ్వర్యాన నిర్వహిస్తున్న రైతు ఉద్యమం 137 రోజులుగా నిరంతరం కొనసాగుతోంది. ఎస్కెఎం పిలుపుమేరకు దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం నిర్వహించారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమ కేంద్రాల్లో రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు.
హికానాలోని దళిత సంస్థలు టిక్రీ సరిహద్దుకు చేరుకోవడం ద్వారా రైతుల ధర్నాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించాయి. చంద్రశేఖర్ ఆజాద్ ఘాజిపూర్ సరిహద్దు, సింఘూ సరిహద్దుకు చేరుకుని ఈ ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ ఉమ్మడి పోరాటానికి పిలుపునిచ్చారు. సింఘూ సరిహద్దులో పంజాబ్ ఎన్ఆర్ఇజిఎ మజ్దూర్ అసోసి యేషన్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కిసాన్ బహుజన్ ఐక్యత వర్థిల్లాలి.. రాజ్యాంగ పరిరక్షణ వర్థిల్లాలి... కిసాన్, దళిత, బహుజన్ ఐక్యత వర్థిల్లాలి అంటూ నినాదాలు హోరెత్తాయి.
రాజ్యాంగ పరిరక్షణకు, అమలుకు
రైతు ఉద్యమం : రైతు నేతలు
దేశంలో రైతు ఉద్యమం రాజ్యాంగ పరిరక్షణకు, అమలుకు రైతు ఉద్యమం జరుగుతుందని రైతు నేతలు స్పష్టం చేశారు. సంస్కరణల పేరిట కేంద్ర ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని తారుమారు చేసి నాశనం చేస్తున్నాయని విమర్శించారు.
కిసాన్ బహుజన్ ఐక్యత దినోత్సవం
కిసాన్ బహుజన్ ఐక్యత దినోత్సవాన్ని కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత, బహుజన్ నాయకులు మాట్లాడుతూ కరోనా మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వం చర్చలు, సంప్రదింపులు లేకుండా మూడు వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టిందని వేదికపై మాట్లాడిన నాయకులు పేర్కొన్నారు. ప్రస్తుత కార్మికులు, రైతులు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడుతున్నారని దళిత, బహుజన్ నాయకులు తెలిపారు.