Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్నోలో కోవిడ్ మరణాలను దాచేస్తున్న యుపి సర్కారు
లక్నో : ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కోవిడ్ మరణాలు బయటకు రావడం లేదా? ప్రభుత్వం వెల్లడిస్తున్న డేటాకు, జరుగుతున్న అంత్యక్రియలకు ఎక్కడా పొంతన వుండడం లేదు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి వాస్తవాలను ప్రభుత్వం దాచిపెడుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత వారం రోజుల్లో కొవిడ్ మరణాలు 124 అని అధికారిక గణాంకాలు తెలియచేస్తున్నాయి. నగర స్మశాన వాటికలు నిర్వహించే రికార్డుల ప్రకారం చూస్తే ఇదే సమయంలో కరోనాతో 400మందికి పైగా మరణించారని తెలుస్తోంది. అంటే 276మంది మరణాలు అధికార రికార్డుల్లో ఎగిరిపోయాయి. ఈ నెల 13న ప్రభుత్వడేటా 18గా వుంది. కానీ ఆ రోజున కరోనాతో మరణించి, అంత్యక్రియలు జరిగిన వారి సంఖ్య 86గా వుంది. ఈ నెల 12న 86మందికి అంత్యక్రియలు జరిగాయి. అధికార డేటా 21గా వుంది. అంతకుముందు రోజు 57మందికి దహన సంస్కారాలు జరగగా, ప్రభుత్వ డేటా ప్రకారం 31మందే మరణించారు. ఈ నెల 10న కూడా అధికార గణాంకాలు 23మంది చనిపోయారని పేర్కొంటుండగా, 59మందికి అంత్యక్రియలు జరిగాయి. అధికార డేటాలో ఈ తేడాల గురించి సీనియర్ లక్నో అధికారి అమిత్ సింగ్ను ప్రశ్నించగా పొరుగున వున్న జిల్లాలు, ఇతర రాష్ట్రాల్లోని కోవిడ్ బాధితులకు ఇక్కడ అంత్యక్రియలు జరిగాయని చెబుతున్నారు. పైగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ వద్ద నమోదైన లేదా ఆస్పత్రుల్లో చేరిన వారి వివరాలనే ప్రభుత్వం నమోదు చేస్తోంది. వేరే ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ మరణించిన వారి వివరాలు మన దగ్గర వుండవని, వారిని ఇక్కడ దహన సంస్కారాలు నిర్వహిస్తారని యుపి డిప్యూటీ ముఖ్యమంత్రి దినేష్ శర్మ మీడియాకు తెలిపారు.