Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలోని పరిమిత వనరులతోనే జనాభాను కరోనా మహమ్మారి నుండి రక్షించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించామని, అదే సమయంలో 80కు పైగా దేశాలకు వ్యాక్సిన్లను అందించామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఆన్లైన్ వేదికగా జరిగిన 'రైసినా డైలాగ్' అనే చర్చా కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. ప్రపంచ స్థితిగతులను మార్చడానికి కరోనా మహమ్మారి అవకాశం కల్పించిందని అన్నారు. ప్రజలు రక్షించడంలో భారత్ కీలకపాత్ర పోషించిందని మోడీ పేర్కొన్నారు. నేటి సమస్యలను, రేపటి సవాళ్లను ఎదుర్కొనేందుకు కరోనా అవకాశం కల్పించిందని అన్నారు. మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మన అనుభవాలను, నైపుణ్యం, వనరులను ప్రపంచ మానవాళితో పంచుకుంటామని అన్నారు. మన పాస్పోర్టు ఫొటోలో మన రంగుతో నిమిత్తం లేకుండా అందరూ కలిసికట్టుగా కషిచేస్తే తప్ప కరోనాపై విజయం సాధించలేమని అన్నారు. భవిష్యత్ తరాలకోసం భూమిని కాపాడాలని అన్నారు. అందరికీ సమానంగా వ్యాక్సిన్ అందించేందుకు 'వ్యాక్సిన్ మైత్రి' ద్వారా భారత్ కృషి చేస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో రువాండా అధ్యక్షుడు పాల్ కగామె, డెన్మార్ ప్రధానమంత్రి మెట్టే ఫ్రెడెరిక్సెన్ ప్రసంగించారు.