Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగులపై కేసులు, అరెస్టులు
- జీతాలు ఇవ్వం, కఠిన చర్యలు తప్పవు : యడియూరప్ప
బెంగళూరు : కర్ణాటకలో ఆర్టిసి ఉద్యోగుల సమ్మె ఎనిమిదో రోజూ కొనసాగింది. వేతన సవరణ ప్రధాన డిమాండ్‌తో ఈ నెల 7 నుంచి ఉద్యోగులు సమ్మె కొనసాగిస్తున్నారు. మంగళవారం, బుధవారం వివిధ పట్ణణాల్లో ప్రధాన రహదారులు, కూడళ్లలో ఉద్యోగులు భిక్షాటన చేశారు. సమ్మె అణిచివేయడానికి రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఉద్యోగులపై కేసులు నమోదు చేస్తోంది. ఉడిపి జిల్లాలోని బైందూర్ పట్ణణ పోలీసులు ఇద్దరు ఉద్యోగులపై ఐపిసిలోని సెక్షన్లు, ఎస్మా, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వంటి అభియోగాలతో కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 72 ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. 115 మంది ఉద్యోగులపై బస్సులు ధ్వంసం చేశారనే అభియోగాలను మోపారు. 19 మందిని అరెస్టు చేశారు. సమ్మె కాలంలో రాష్ట్రంలో 60 బస్సులు ధ్వంసమయ్యాయని అధికారులు చెబుతున్నారు.
కఠిన చర్యలు తప్పవు : యడియూరప్ప
కెఎస్ఆర్టిసి ఉద్యోగుల డిమాండ్లను పట్టించుకునే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప స్పష్టం చేశారు. సమ్మెలో ఉన్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వబోమని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధులకు రాకపోతే గైర్హాజరుగానే పరిగణిస్తామని తేల్చిచెప్పారు. కార్మికులతో ఎలాంటి చర్చలు నిర్వహించ బోమన్నారు. విధులకు రావడానికి ఇష్టపడుతున్న ఉద్యోగు లకు పూర్తి భద్రత కల్పించాలని అధికారులను ఆదేశించారు. బస్సుల రాకపోకలకు ఆటంకం కలిగించేవారిపై, అల్లర్లుకు పాల్పడేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించండి : సిఐటియు
కర్ణాటక ఆర్టిసి ఉద్యోగుల న్యాయమైన, సహేతుక మైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని సిఐటియు డిమాండ్ చేసింది. ఉద్యోగుల సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ మేరకు సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగులు, యూనియన్ల సమస్యలను పరిష్కరించడం కోసం ఎలాంటి చర్చలు, ప్రతిపాదనలను రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం చేయకపోవడం అత్యంత దురదృష్టకరమని సిఐటియు పేర్కొంది. సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి అణిచివేత ప్రయ త్నాలను చేస్తోందని విమర్శించింది. కార్మికులను బెదిరింపు లకు గురిచేస్తున్నారని ఆరోపించింది. సమ్మె చేస్తున్న కార్మికులకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారని గుర్తుచేసింది. కార్మికులపై ప్రతీకార చర్యలు ఉపసంహరించుకునేలా ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. సమస్యలను పరిష్కరించడానికి సానుకూల విధానంతో చర్చలు ప్రారంభించాలని కోరింది.