Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ నేతలకు చోటు
- 20 మంది అనధికార సభ్యులదే హవా
న్యూఢిల్లీ : ఇటీవల కొత్తగా నియమిం చిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) బోర్డులో నాన్-అఫీషియల్ సభ్యుల్లో చాలా మంది బీజేపీతో సంబంధాలు ఉన్న వారే. విధాన సమీక్షలో ముఖ్య పాత్ర పోషించే కొత్తగా ప్రకటించిన 46 మంది సభ్యుల ఎంఎస్ఎంఈ బోర్డు లో 26మంది అధికారిక సభ్యులు, 20మంది నాన్-అఫిషియల్ సభ్యులు న్నారు. రాజకీయ ఆధిపత్యం మరోసారి బట్టబయలైంది. ఈ జాబితాలో బీజేపీ ఆఫీస్ బేరర్లు, పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ లఘు ఉద్యోగ్ భారతి సభ్యులు ఉన్నారు. ఎంఎస్ ఎంఈ అభివృద్ధి చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం ఈ బోర్డును కేంద్రం ఏర్పాటుచేసింది. ఇందులో సూక్ష్మ, చిన్న, మధ్యత రహా సంస్థల సంఘాలకు ప్రాతినిధ్యం వహించిన వారు 20 మంది ఉండాలి. అలాగే మహిళా వ్యాపార సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు ముగ్గురు కంటే తక్కువ కాకుం డా, సూక్ష్మ సంస్థల సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నవారు ముగ్గురు కంటే తక్కువ లేకుండా ఉండాలి. కాగా, అందుకు విరుద్ధంగా ఇటీవల కేంద్రం నియమించిన బోర్డు జాబితాలో బీజేపీ ఎమ్మెల్యేకు స్థానం కల్పించారు. ముగ్గురు మాజీ ఎమ్మె ల్యేలు, అభ్యర్థులున్నారు. ఒక మాజీ ఎమ్మెల్యే ఏజేఎస్‌యూ (జార్ఖండ్‌లో బీజేపీ భాగస్వామి), లఘు ఉద్యోగ్ భారతి (ఎల్‌యూబీ) సభ్యులు ఆరుగురు, బీజేపీ నేతలు ఆరుగురు, ఎఫ్ఐసీసీఐకి చెందిన ఇద్దరు మాజీ సభ్యులు, గుజరాత్ నుంచి ఒకరున్నారు.
కాషాయ పార్టీతో సంబంధాలు...
ఈ బోర్డులో ఉన్న బీహార్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కుందన్ కుమార్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే పెనుమెత్స విష్ణు కుమార్ రాజు, 2014లో హర్యానా ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి యశ్వీర్ డాగర్, 2009లో ఒడిశాలోని కటక్ బీజేపీ అభ్యర్థి, రెండు కంపెనీల్లో డైరెక్టర్ ప్రదీత్ కేషరి మిశ్రా, ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి టీనా శర్మ, బీజేపీ పూర్వంచల్ మోర్చా నేత రష్మి మిశ్రా, బీజేపీ మణిపూర్ ప్రదేశ్ కోశాధికారి రాబిన్ బ్లాకీ, బీజేపీ పంజాబ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ రాకేశ్ గుప్తా, బీజేపీ ఉద్యోగ్ అగాడి మహారాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులు ప్రదీప్ పేష్కర్, బీజేపీ యువ మోర్చా ఉపాధ్యక్షుడు, వడోదరకు చెందిన పి-మెట్ హైటెక్ డైరెక్టర్ హేమల్బెన్ మెహతా, బీజేపీ గుజరాత్ రాష్ట్ర కార్యదర్శి అమిత్ థాకర్ భార్య, లఘు ఉద్యోగ్ భారతి (ఎల్‌యూబీ) అధ్యక్షుడు బల్దేవ్భారు గోవింద్భారు ప్రజాపతి, ఎల్‌యూబీ జాతీయ సమన్వయ కర్త, బీజేవైఎస్ మాజీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నరేష్ చంద్ పరీక్, ఎల్‌యూబీ కార్యదర్శి సంపత్ తోష్నివాల్ వంటి వారికి బీజేపీతో నేరుగా సంబంధాలున్నాయి. ఈ జాబితాలో ఫిక్కీ మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు, కామివిజన్ ఇండియా ఎండీ, సీఈఓ హర్జిందర్ కౌర్, కర్నాటక ఫిక్కీ విభాగం మాజీ అధ్యక్షురాలు, ప్రీమియర్ స్టార్చ్ ఉత్పత్తుల ఎండి జెఆర్ బంగేరాలకు స్థానం కల్పించారు.
అయితే దీనిపై వివరణ కోరేందుకు జాతీయ మీడియా సంస్థ పంపిన ఈ మెయిల్‌కు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. అందులో కొంతమందికి కాషాయ పార్టీతో సంబంధాలున్నప్పటికీ.. వారికి వ్యాపార సంబంధాలున్నాయని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే పెనుమెత్స విష్ణు కుమార్ రాజు, ఒడిశా బీజేపీకి చెందిన ప్రదీత్ కేషరి మిశ్రాలకు పంపిన ఈ మెయిల్స్‌కు ఎటువంటి స్పందనా లేదు. ఎంఎస్ఎంఈ అభివృద్ధి చట్టం ప్రకారం బోర్డులో 26 మంది అధికారిక (అఫిషీయల్) సభ్యులు ఉంటారు. దీనికి కేంద్ర మంత్రి (నితిన్ గడ్కరీ) అధ్యక్షత వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆరుగురు మంత్రులు, ముగ్గురు ఎంపీలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత నిర్వాహకుడు, ఎంఎస్ఎంఈ కార్యదర్శి, వాణిజ్య, పరిశ్రమల కార్యదర్శులు, ఆర్థిక, ఫుడ్ ప్రాసెసింగ్, కార్మిక, ప్రణాళిక కార్యదర్శులు, జాతీయ బ్యాంకు చైర్మెన్, చిన్న పరిశ్రమల బ్యాంక్ చైర్మెన్, ఐబీఏ చైర్మెన్, ఆర్బీఐ అధికారి, ముగ్గురు నిపుణులు, సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్‌కు చెందిన ఇద్దరు ప్రతినిధులు, ఎంఎస్ఎంఈ నుంచి ఒక అధికారి జాయింట్ సెక్రటరీ హౌదాకు తక్కువ కాకుండా ఉండాలి.
వైస్ చైర్మెన్‌గా ఎంఎస్ఎంఈ సహాయ మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి, బోర్డు సభ్యులుగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, మహారాష్ట్ర, కర్నాటక, అసోం రాష్ట్రాల మం త్రులున్నారు. ముగ్గురు ఎంపీలు శంకర్ లాల్వాని (బీజేపీ), భీశెట్టి వెంకట సత్యవతి (వైసీపీ), బండా ప్రకాష్ (టీఆర్ఎస్) సభ్యులుగా ఉన్నారు. ప్రముఖ వ్యక్తుల విభాగంలో సిలిగురి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ అగర్వాల్ (పారిశ్రామిక వేత్త), లఘు ఉద్యోగ్ భారతి ఉపాధ్యక్షుడు స్మిత యశ్వంత్ ఘైసాస్ (ఆర్థికవేత్త), ఆయురాన్ ఇంప్లాంట్స్ ఎండీ, దివంగత బీజేపీ నేత మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పాల్ పారికర్‌లను నియమించారు.