Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో తీవ్రస్థాయికి కరోనా
- యూపీ సీఎం, మాజీ సీఎంలకు పాజిటివ్
- మరణ లెక్కలు దాస్తున్న మధ్యప్రదేశ్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. దీంతో దేశంలో ఇదివరకెప్పుడు నమోదుకాని రీతిలో కోవిడ్-19 మరణాలు, కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. కొత్త కేసులు రెండు లక్షలకు చేరువగా పరుగులు తీయడం, కరోనా మరణాలు ఒక్కరోజే వేయికిపైగా నమోదుకావడం దేశంలో వైరస్ వ్యాప్తికి అద్దం పడుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం... దేశంలో గత 24 గంటల్లో కొత్తగా1.84 లక్షల మందికి మందికి కరోనా సోకింది. ఇదే సమయంలో 1027 మంది మరణించారు. దేశంలో ఒకే రోజులో కొత్తగా వెలుగుచూసిన అత్యధిక కేసులు, మరణాలు ఇవే కావడం గమనార్హం. మొత్తంగా దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,38,73,825కు చేరగా, మరణాల సంఖ్య 1,72,085కు పెరిగింది. కాగా, దేశంలో కరోనా కేసులు అధికంగా నమోదైన రాష్ట్రాల్లో మహా రాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బెంగాల్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, గుజ రాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. కొత్తగా నమో దవుతున్న కేసులు కేవలం పది రాష్ట్రాల్లోనే 82శాతం వెలుగుచూశాయని కేేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా ఉత్తరప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి అధికమవుతూనే ఉన్నది. దీంతో సామాన్యుల మొదలు ప్రముఖులం దరూ కరోనా బారినపడుతున్నారు. తాజాగా రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కరోనా సోకింది. తనకు కరోనా సోకిందని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆయన ఓఎస్డీ అభిషేక్ కౌషిక్ సహా కొందరికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. కాగా, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కూడా కరోనా బారిన పడ్డారు. హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమే ళాకు వెళ్లొచ్చిన తర్వాత ఆయనలో స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా వచ్చింది.
జార్ఖండ్‌లో అరగంట సేపు అర్థనాదాలు.. వైద్యులు రాకపోవడంతో గేటు వద్దే మృతి
జార్ఖండ్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ కరోనా రోగి అరగంట సేపు డాక్టర్.. డాక్టర్ అని ఎంత పిలిచినా రాలేదు. ఆస్పత్రి గేటు దగ్గరే సాయం కోసం ఏడుస్తూ వేడుకున్నా ఏ ఒక్కరూ స్పందించలేదు. చివరికి ఆస్పత్రి గేటు దగ్గరే కరోనా పేషెంట్ ప్రాణాలు వదిలాడు. దీంతో అతడి కూతురు తన గుండెల్లో గూడు కట్టుకున్న బాధనంతా వెళ్లగక్కింది. అదే టైంలో ఆస్పత్రి పరిశీలనకు వచ్చిన ఆరోగ్య మంత్రిని కడిగిపారేసింది. ఈ ఘటన రాంచీలోని సదర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా వచ్చారని తెలిసి ఆయన్నూ కడిగిపారేసింది. ''మంత్రిగారూ.. మీ వైద్యులంతా బిందాస్‌గా గడుపుతున్నారు. మా నాన్న కొనూపిరితో కొట్టుమిట్టాడినా అరగంట దాకా ఏ డాక్టరూ రాలేదు. మీరు కేవలం ఓట్లు అడగడం కోసమే వస్తారా?'' అంటూ ఆవేదనాభరితంగా నిలదీసింది. మీ ఓట్లను కాపాడుకోవడానికే ఇప్పుడు ఆస్పత్రిలో తనిఖీలు చేస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ రాజధాని ఢిల్లీలోని కరోనా ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఐసీయూ, ఆక్సిజన్ సౌకర్యం ఉన్న ఆస్పత్రుల్లో పడకల కొరత వేధిస్తోంది.
ప్రభుత్వ లెక్కలు నలుగురు.. అంత్యక్రియలు 84 మందికి !
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కరోనా మరణాలపై సరైన గణాంకాలు వెల్లడించడం లేదని సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా భోపాల్ లోని భద్భద్, సుభాష్ నగర్ఘాట్లలో కోవిడ్-19 ప్రోటోకాల్‌ను అనుసరించి మొత్తం 84 మృత దేహాలకు అంత్యక్రియలు జరిగాయి.
అయితే గడచిన ఐదు రోజుల్లో ప్రతీరోజు కనీసం 50 డెడ్‌బాడీలు స్మశానవాటికల వద్దకు తరలిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గడచిన ఐదు రోజుల్లో కరోనా కారణంగా కేవలం 10 మంది మాత్రమే మరణించారని పేర్కొంటోంది. అలాగే, గత 24 గంటల్లో మొత్తం 84 మృత దేహాలకు అంత్యక్రియలు జరగగా, ప్రభుత్వం భోపాల్‌లో కరోనా కారణంగా కేవలం నలుగురే మరణించారని చెబుతోంది.